
పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో నిబంధనలు పాటించాలి
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.ఖీమ్యానాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ కానున్న నేపథ్యంలో సోమవారం జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప్రచార సందర్భంగా కరపత్రాలు, పోస్టర్ల ముద్రణలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాల్సిన నియయాలపై అవగాహన కల్పించారు. ప్రచార సామగ్రి అయిన పోస్టర్లు, కరపత్రాల్లో ఎక్కడ కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించరాదని, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పబ్లిషర్ నుంచి ఫారం ఏ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఏ, బీ తో పాటు ముద్రించిన 4 కరపత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్‌కు పంపించాలన్నారు. ముద్రించిన కరపత్రం లేదా వాల్‌పోస్టర్‌పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా ఖచ్చితంగా పేర్కొనాలని, ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న పైకం ఎంత అనే వివరాలు ఫారం–బీ లో చూపెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి పి.సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాల్గొన్నారు.
నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు
నిర్వహించాలి
పాన్‌గల్: స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యానాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధులు నిర్వహించే పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ తరగతులను జేసీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడిలకు గురికాకుండా వివాదరహితంగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల పనితీరు, డిస్ట్రిబ్యూషన్, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్‌లు తెరవడం, బాక్స్‌లను సీజ్ చేయడం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిక్షణలో టెండర్ బ్యాలెట్, చాలెంజింగ్ ఓట్లపై ఆర్పీలు అవగాహన కల్పించారు. శిక్షణకు 34 మంది పీఓలు, 61 మంది ఏపీఓలు హాజరయ్యారు. రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణలో రెండో రోజు పంచాయతీ ఎన్నికలపై శిక్షణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ ఉమాదేవి, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవింద్‌రావు, ఏపీఓ కుర్మయ్య, ఆర్‌ఐలు మహేష్, తిరుపతయ్య, సిబ్బంది మల్లేష్, శివరామ్ పాల్గొన్నారు.