
ఎన్నికల్లో సత్తా చాటుదాం : సీపీఎం
అమరచింత: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీఎస్ గోపి తెలిపారు. మంగళవారం మండలంలోని చంద్రనాయక్‌తండా, పాంరెడ్డిపల్లి, కొంకన్వానిపల్లిలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. సమస్యలపై పోరాడే నాయకులను గెలిపించుకోవడంతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలిచ్చి గెలిచిన తర్వాత సంపాదనే ధ్యేయంగా భావిస్తున్న బుర్జువ పార్టీలకు ఎన్నో పర్యాయాలు అవకాశం ఇచ్చి ప్రజలు విసిగి పోయారని.. వారు కోరుకునే పాలన సీపీఎంకే సాధ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతోందని.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదలకు అవకాశం ఇవ్వకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తూ గెలుపే లక్ష్యంగా ముందకు వెళ్లాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు వెంకటేష్, అజయ్, రమేష్, రాఘవేంద్ర, శ్రీను, శంకర్, అంజిరెడ్డి, మొగిలన్న, హర్యానాయక్, బాలకృష్ణ పాల్గొన్నారు.
హంస ధాన్యం
క్వింటా రూ.1,789
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం హంసధాన్యం క్వింటాల్ రూ. 1,789 ధర పలికింది. ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో కేవలం 200 బస్తాల హంస ధాన్యం మాత్రమే అమ్మకానికి వచ్చింది. బుధవారం మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా ఉల్లి కొనుగోళ్లు చేపట్టనున్నారు. అయితే కొన్ని వారాలుగా ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ వారం ధరలు పెరుగుతాయా లేదా అనే విషయం వేలం ద్వారా తెలియనుంది.