వనపర్తి: ఉత్తమ ఉపాధ్యాయులు–2025 అవార్డులకుగాను జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాభివృద్ధిశాఖ అధికారి అఫ్జలుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్‌లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 14 వరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌నంబర్ 08545–232500ను కార్యాలయ పనిదినాల్లో సంప్రదించాలని సూచించారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి
పాన్‌గల్: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో పీఓ, ఏపీఓల శిక్షణకు ఆమె హాజరై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. శిక్షణలో సూచించిన అన్ని అంశాలను తప్పక పాటించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలపై ఆర్పీలకు అవగాహన కల్పించాలని కోరారు. శిక్షణలో 34 మంది పీఓలు, 61 మంది ఏపీఓలు పాల్గొన్నారు. సమావేశంలో తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఎంఈఓ ఆనంద్, ఆర్‌ఐలు మహేష్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
సంత స్థల సమస్య పరిష్కరించాలి
వనపర్తి రూరల్: ప్రభుత్వం, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవచూపి పెబ్బేరు సంత స్థల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాచాల యుగంధర్‌గౌడ్ కోరారు. మంగళవారం పెబ్బేరులోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెబ్బేరు గ్రామపంచాయతీ నుంచి పురపాలికగా మారిన తర్వాత చాలా సమస్యలతో సతమతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంత ద్వారా వారానికి రూ.6.36 లక్షల మేర వచ్చే ఆదాయంతో పట్టణాభివృద్ధి చేపట్టేవారని, స్థల వివాదం కోర్టులో ఉండటంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నాలుగు నెలల కిందట ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినా.. నేటికీ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పట్టణంలో రెండేళ్ల కిందట ప్రారంభించిన వనపర్తి–పెబ్బేరు రహదారి విస్తరణ పనులు నేటికీ అసంపూర్తిగా ఉన్నాయని.. త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వీవీ గౌడ్, ధరేంద్రసాగర్, దేవర శివ, అంజన్న, జితేందర్, రాఘవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యం
కొత్తకోట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని బీజేపీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండా ప్రశాంత్‌రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధికార కాంగ్రెస్‌పార్టీ వైఫల్యాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ బీజేపీ పూర్తిస్థాయిలో బలపడాలని.. అందుకు నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధ్యక్షుడు భరత్‌భూషణ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కోటేశ్వర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ, సీనియర్ నాయకులు సాయిరాం, పబ్బ నరేందర్‌గౌడ్, స్టార్ బాలు, దాబా శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్, చిన్న, మూర్తి, రాజమౌళి, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.