
కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి
వనపర్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలు యజమాన్యాల కుట్రలో నిర్వీర్యం కాకుండా పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పీ.సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికుల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికులకు లేబర్ జీఓ కాకుండా పీఆర్‌సీ జీఓ 60 అమలు చేయడంతో కార్మికులకు రూ. 15,600 వేతనాలు పెంచుతున్నట్లు ప్రభుత్వ కాగితాల్లో అంకెలు చూపుతున్నా, దొడ్డి దారిన యజమాన్యాలకు అనుకూలంగా సర్క్యులర్ జారీ చేసి క్షేత్రస్థాయిలో కార్మికులకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీల కాలపరిమితి ముగిసిందని, ప్రస్తుత ప్రభుత్వం రూ.26 వేలు కనీస వేతనం నిర్ణయించి జీఓ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పాలకుల ఉదాసీన వైకరి ఫలితంగా 2012 నుంచి నేటి వరకు కనీస వేతన జీఓ 68, 43లు సవరణకు నోచుకోలేదని, దీంతో కార్మికులు తీవ్రమైన ఆర్థిక శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్మికులు ఎస్ వరుణ్, మన్నెమ్మ, చెన్నమ్మ, సుధ, శోభ, శారద, లావణ్య, శివలీల, రాజేశ్వరి, నారమ్మ, బొజ్జమ్మ, తదితరులు పాల్గొన్నారు.