
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద
11 జిల్లాల ఉద్యోగుల ఆందోళన
బీచ్‌రోడ్డు: గతంలో కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడంలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు 11 జిల్లాల విద్యుత్ ఉద్యోగులు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీఎస్‌పీఈ చైర్మన్ ఎస్. కృష్ణయ్య, కన్వీనర్ ఎంవీ రాఘవ రెడ్డి మాట్లాడుతూ యాజమాన్యాలకు, రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అందుకే విధిలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా దశలవారీ ఆందోళన కార్యక్రమాలు రూపొందించుకున్నామని తెలిపారు. జూనియర్ లైన్ మెన్ గ్రేడ్–2లకు వర్తింపజేసిన కొత్త సర్వీసు నిబంధనలను తక్షణమే రద్దు చేసి, పాత నిబంధనలు అమలు చేసి సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లైన్‌మెన్ పోస్టులలో జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 లకు వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు. 1999 నుంచి 2004 వరకు నియమితులైన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీపీఎఫ్ , పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
కార్మిక చట్టాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం నిబంధన అమలు చేసి, పొరుగుసేవల సిబ్బందికి, కాంట్రాక్టు కార్మికులకు విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు, అలవెన్సులను చెల్లించే ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు వాయిదాల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యాన్ని తక్షణమే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులలో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి, తమ ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఏపీఎస్‌పీఈ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కో–ఛైర్మన్ కె.వి. శేషారెడ్డి, డిస్కం యూనిట్ చైర్మన్ గణపతి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి