
బామ్మ, మనవడ్ని కట్టేసి భారీ చోరీ
సమయం: ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట
స్థలం: విశాఖపట్నం, రెడ్డి కంచరపాలెం,
ఇందిరానగర్–5
ఏం జరిగింది : ఇంట్లోవాళ్లను తాళ్లతో కట్టేసి భారీ చోరీ
మర్రిపాలెం: ఆనంద్‌రెడ్డి ఇల్లు గాఢ నిద్రలో ఉంది. రైల్వే కాంట్రాక్టర్ అయిన ఆనంద్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారు. ఇంట్లో కేవలం ఆయన తల్లి ఎల్లమ్మ (65), కుమారుడు కృష్ణకాంత్‌రెడ్డి (18) మాత్రమే ఉన్నారు. జాతీయ రహదారి సమీపంలో ఉన్నప్పటికీ, ఆ సమయంలో ప్రాంతం నిశ్శబ్దంగా ఉంది. ముగ్గురు గుర్తుతెలియని దుండగులు..ముఖాలకు మాస్కులు వేసుకుని పక్కా ప్రణాళికతో ఇంటి వెనుక తలుపుల వద్దకు చేరుకున్నారు. క్షణాల్లో వారు తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. దుండగులు నేరుగా నిద్రిస్తున్న బామ్మ, మనవడి గదిలోకి వెళ్లారు. దుండగులను చూసి తేరుకునేలోపే బామ్మ, మనవడ్ని ప్లాస్టిక్ తాడుతో చేతులు, కాళ్లు గట్టిగా కట్టేశారు. అరుపులు వినిపించకుండా ఉండేందుకు నోటికి ప్లాస్టిక్ టేప్‌లను చుట్టేశారు. ఊపిరి ఆడటానికి కష్టం అవుతున్నా, భయం వారికి మాట రాకుండా చేసింది. నిస్సహాయంగా కళ్ల ముందు జరుగుతున్న దోపిడీని వారు వీక్షించాల్సి వచ్చింది. బాధితులను బంధించిన తర్వాత, దొంగలు ఇంట్లో వెతకడం ప్రారంభించారు. ఎల్లమ్మ మెడలోని బంగారు ఆభరణాలు తెంచుకున్నారు. కృష్ణకాంత్‌రెడ్డి చేతికి ఉన్న డైమండ్ రింగ్ లాక్కున్నారు. బీరువాను పగలగొట్టి, అందులో దాచిన పది తులాల బంగారం వస్తువులు, రూ. 3 లక్షలు చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత.. దుండగులు తాము దొంగిలించిన వస్తువులను బ్యాగుల్లో సర్దుకున్నారు. అంతటితో ఆగకుండా ఇంటి యజమాని ఆనంద్‌రెడ్డికి చెందిన మహేంద్ర ఎక్స్‌యూవీ కారుతో పరారయ్యారు. సోమవారం ఉదయం స్థానికుల సహాయంతో విడిపించుకున్న ఎల్లమ్మ, కృష్ణకాంత్‌రెడ్డి హుటాహుటిన కంచరపాలెం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ క్రైమ్ సీఐ చంద్రమౌళి కేసు నమోదు చేసి, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ చంద్రమౌళి, ఫోరెన్సిక్ టీమ్ ఇంటి వెనుక తలుపుల వద్ద పగిలిన భాగాలను, లోపల చెల్లాచెదురైన బీరువాను పరిశీలించారు. దొంగల కోసం వెస్ట్ క్రైమ్ సీఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగులు తీసుకువెళ్లిన మహేంద్ర ఎక్స్‌యూవీ కారు నంబర్‌తో నగరంలోని అన్ని అవుట్‌పోస్టులకు సమాచారం అందించారు. కారును మారిక వలస వద్ద విడిచిపెట్టి పరారైనట్టు పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ చంద్రమౌళి తెలిపారు.

బామ్మ, మనవడ్ని కట్టేసి భారీ చోరీ