
ప్రజల సంపూర్ణ సహకారంతోనే విశాఖ అభివృద్ధి
సందడిగా స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవంలో ఎంపీ శ్రీ భరత్
బీచ్‌రోడ్డు : ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు గడించిన విశాఖను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని ఎంపీ ఎం. శ్రీభరత్ పేర్కొన్నారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. నగర పరిశుభ్రత విషయంలో ప్రజల్లో మార్పు రావాలని, ఈ దిశగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ లంగ్స్’కు 80 శాతం మంది ప్రజలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఫుట్‌పాత్‌లు కేవలం ప్రజలు నడవడానికి మాత్రమేనని, వాటిని వ్యాపార ఆక్రమణలకు ఉపయోగించవద్దని స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటన అనుభవాలను పంచుకుంటూ, అక్కడ జంతువులతో పాటు మనుషుల జీవన విధానాన్ని ప్రతిబింబించే ‘బయో ఫ్లెక్స్ సిటీ’ విధానాన్ని జూ పార్క్, కై లాసగిరి ప్రాంతాల్లో అధ్యయనం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు ప్లాస్టిక్ జెండాలు, ఫ్లెక్సీలకు బదులుగా డిజిటల్ బోర్డులు వినియోగించాలని సూచించారు.
స్వర్ణాంధ్ర సాధించాలంటే స్వచ్ఛాంధ్ర ముఖ్యం : కలెక్టర్
కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందుగా స్వచ్ఛాంధ్ర సాధించాలని అన్నారు. జిల్లాలో పరిశుభ్రత కోసం ప్రతి మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లా 45 జిల్లా స్థాయి, 7 రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు నాగలక్ష్మి, రాము, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎస్ ఆర్టీసీకి స్వచ్ఛాంధ్ర అవార్డు
డాబాగార్డెన్స్: స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఏపీఎస్ ఆర్టీసీ ఎంపికై ంది. నగరంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా అవార్డును జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు అందుకున్నారు.