
పొట్ట కొట్టొద్దు
భూములు లాక్కొని
తగరపువలస : ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీకి చెందిన దళితవాడలో సోమవారం నిర్వహించిన గ్రామసభ.. దళిత రైతుల తీవ్ర ఆందోళన మధ్య వాయిదా పడింది. గూగుల్ టెక్ సంస్థకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం దళితులకు చెందిన డీ పట్టా, బంజరు భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు భీమిలి ఆర్డీవో సంగీత్ మాథుర్, తహసీల్దార్ సూరిశెట్టి శ్రీనుబాబుల ఎదుటే ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవనాధారంగా ఉన్న భూములను లాక్కొని పొట్ట కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు తెలియకుండానే తీర్మానం
తర్లువాడ పంచాయతీలో సర్వే నంబర్–1తో పాటు 35, 71, 72, 74, 75లలో ఉన్న సుమారు 350 ఎకరాల భూమిని గూగుల్ టెక్ సంస్థకు ఇవ్వడానికి ప్రభుత్వం సేకరిస్తోంది. అయితే సాగులో ఉన్న రైతులకు, ఇద్దరు దళిత వార్డు సభ్యులకు కూడా తెలియకుండానే పంచాయతీ తీర్మానం చేసి పంపడం రైతుల్లో ఆగ్రహానికి కారణమైంది. అంతేకాకుండా సోమవారం గ్రామసభ నిర్వహిస్తున్న సమాచారం కూడా రైతులకు తెలియనివ్వలేదు. గ్రామ సచివాలయంలో ప్రదర్శించకుండా, దండోరా వేయించకుండా తూతూ మంత్రంగా గ్రామసభ నిర్వహించడానికి టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ తరపున వైఎస్సార్‌సీపీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, సర్పంచ్ బీఆర్‌బీ నాయుడు హాజరయ్యారు.
మూడు తరాల జీవనాధారం
1971లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 49 మంది దళిత రైతులకు రెండు ఎకరాల వంతున డీ పట్టా భూములు కేటాయించింది. అప్పటి నుంచి మూడు తరాలుగా రైతులు ఈ భూముల్లో తోటపంటలు, కూరగాయలు, పువ్వులు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. గత ప్రభుత్వాలు బోరుబావులు, విద్యుత్, సోలార్ యంత్రాలు మంజూరు చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించాయని రైతులు గుర్తు చేశారు. ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శవంతమైన ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని తుడిచిపెట్టి సాఫ్ట్‌వేర్ రంగాన్ని ప్రతిపాదించడం తమను హత్య చేయడమేనని రైతులు ఆక్రోశం వ్యక్తం చేశారు. గతంలో 80 ఎకరాలు మాత్రమే ఇస్తామని చెప్పి, ఇప్పుడు 200 ఎకరాల వరకు పెంచుకుంటూ పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
భూమి ఇవ్వడానికి నిరాకరణ
ప్రభుత్వం ఎకరానికి రూ.48 లక్షల పరిహారం, ఒకరికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నాన్ టెక్నికల్ ఉద్యోగం ఇవ్వనుందని అధికారులు ప్రతిపాదించారు. దీనికి ఒక రైతు మాత్రమే అంగీకరించగా, 48 మంది దళిత రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఒక ఎకరా ఉచితంగా ఇస్తాం, మిగిలిన ఒక ఎకరానికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇవ్వాలి’ అని రైతులు డిమాండ్ చేశారు. ఈ గందరగోళం, ఆందోళన మధ్య అధికారులు గ్రామసభను వాయిదా వేసుకుని వెనుదిరిగారు.
బెదిరిస్తే ఉద్యమిస్తాం
బెదిరించి సాగులో ఉన్న భూములు తీసుకుంటామంటే ఉద్యమిస్తాం. ఇప్పుడు ఈ భూములు కోల్పోతే పేద దళిత కుటుంబాలు అన్నీ రోడ్డున పడిపోతాయి. మాకు వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియదు. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం కుటుంబంలో వాటాలు వేసుకుంటే నెలరోజుల భత్యానికే సరిపోదు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మాకు అండగా నిలవాలి.
– చందల వెంకన్న
ఏడాది పొడవునా పంటలు
మేము ఇద్దరం అన్నదమ్ములం. పిల్లలు, మనుమలు అందరూ కలిపి 10 మంది కుటుంబ సభ్యులం. మాకు ఈ భూమే ఆధారం. ఏడాది పొడవునా బీర, ఆనప, మినప, కొర్రలు, సజ్జలు, కందులు, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలు పండించుకుని ఉపాధి పొందుతున్నాం. ఇప్పుడు అర్ధాంతరంగా మా భూములు లాక్కొనే బదులు చాలా వరకు బంజరు భూములు ఉన్నాయి. మా పొట్ట కొట్టకండి. – పైల రాము
అంతా రహస్యమేనా..
పంచాయతీ పాలకవర్గంలో కొండ్రు శంకర్, పైల బంగారమ్మ అనే ఇద్దరు దళిత సభ్యులు ఉన్నారు. వారికి గానీ, రైతులకు గానీ తెలియకుండా భూములు తీసుకోవడానికి పంచాయతీ ఎలా తీర్మానం చేస్తుంది. కనీసం గ్రామసభ పెడుతున్నట్టు కూడా సమాచారం లేదు. టీడీపీ నాయకులు తమ భూములను దొడ్డిదారిన పాస్ పుస్తకాలు చేయించుకొని, మిగిలిన రైతుల భూములను ఫణంగా పెడతామంటే ఊరుకోం. – రెల్లి రామకృష్ణ

పొట్ట కొట్టొద్దు

పొట్ట కొట్టొద్దు

పొట్ట కొట్టొద్దు

పొట్ట కొట్టొద్దు