
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థులకు అనారోగ్యం
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్
డాబాగార్డెన్స్: పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలం శివన్నపేట గురుకులం ఆశ్రమ పాఠశాలలో 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మొదట పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, గుమ్మలక్ష్మీపురం పీహెచ్‌సీల్లో చికిత్స పొందినప్పటికీ, 37 మంది విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో వారిని విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనను ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నారు. ఆయన విశాఖలో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆదివారం పరామర్శించారు. పాఠశాలలో మంచినీరు, వాష్‌రూమ్‌లు, వసతి గదులు, డైనింగ్ హాల్ వంటి సరైన సదుపాయాలు లేకపోవడం, అలాగే హెల్త్ చెకప్‌లు నిర్వహించకపోవడం, హెల్త్ అసిస్టెంట్లు లేకపోవడమే ఈ దుర్ఘటనకు, ఇద్దరు విద్యార్థుల మరణానికి, 110 మంది ఆసుపత్రిలో చేరడానికి కారణమని వారు విమర్శించారు. చనిపోయిన విద్యార్థులకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ అసిస్టెంట్స్‌ను నియమించాలని, విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు.