
గాంధీ మార్గం అనుసరణీయం
జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: మహాత్మా గాంధీ ఆచరించిన అహింస, శాంతి మార్గాలు మనందరికీ అనుసరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి గురువారం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమంలో సత్యం, అహింస ఆయుధాలుగా, శాంతి, సహనం కవచాలుగా చేసుకుని భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. స్వాతంత్య్ర ఫలాలను పొందుతున్న మనం ఆర్థిక స్వాతంత్య్రం పొంది ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు.
శాస్త్రి చిరస్మరణీయుడు : జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని దేశానికి అందించి, కష్టపడే రైతు, సరిహద్దుల్లో సైనికుడిని సమానంగా గౌరవించిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాస్త్రి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. సాధారణ జీవనశైలి, నిజాయితీ, దేశం పట్ల అంకితభావం కలిగిన శాస్త్రి చిరస్మరణీయుడన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి బీవీ రాణి, డీపీవో శ్రీనివాసరావు, జీవీఎంసీ, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.