
మెరుగు పేరుతో ఘరానా మోసం
24 తులాల బంగారు ఆభరణాల చోరీ మట్టి కుండలో ఉప్పు పెట్టి ఉడాయించిన కేటుగాళ్లు ప్రధాన నిందితుడి అరెస్ట్, మొత్తం సొత్తు స్వాధీనం
కూర్మన్నపాలెం: పాత బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని న మ్మించి.. మహిళను మోసం చేసిన అంతర్ జిల్లా ఘరానా మోసగాడు ముదేరినవారి రమణను దువ్వాడ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 24 తులాల బంగారు ఆభరణాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సౌత్ సబ్ డివిజన్ క్రైం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి ప్రశాంతినగర్‌లో స్టీల్‌ప్లాంట్ జనరల్ మేనేజర్ నివాసం ఉంటున్నారు. అతని భార్య వద్దకు ఈ ఏడాది జూలై 15న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. పాత బంగారు ఆభరణాలకు కొత్త మెరుపు తీసుకువస్తామని, తమ వద్ద ఉన్న నమూనాలను చూపి నమ్మించారు. వారి మాటలు విశ్వసించిన ఆమె.. తన వద్ద ఉన్న సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను వారికి ఇచ్చింది. నిందితులు ఆ ఆభరణాలను ఒక మట్టి కుండలో పెట్టి, ఏదో రసాయన ద్రావణంలో ముంచినట్లు నాటకమాడారు. అనంతరం ఆ కుండకు ఒక తెల్లని వస్త్రం చుట్టి.. ‘ఈ కుండను 10 రోజుల పాటు ఇంటి ఈశాన్య దిశలో సూర్యరశ్మి తగలకుండా ఉంచి, 11వ రోజున తెరవాలి’ అని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. వారి సూచన మేరకు 11వ రోజున కుండను తెరిచి చూడగా, అందులో బంగారు ఆభరణాలకు బదులుగా కల్లు ఉప్పు ఉండటంతో బాధితురాలు తాను మోసపోయానని గ్రహించింది. కుటుంబ సభ్యుల సాయంతో ఆగస్టు 20వ తేదీన దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో క్రైం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటై, దర్యాప్తు ప్రారంభించాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కదలికలను పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఈ నెల 29న అనకాపల్లి జిల్లా మారేడుపూడి బస్టాప్ వద్ద ప్రధాన నిందితుడైన ముదేరినవారి రమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రమణది అన్నమయ్య జిల్లా పాతరాయచోటి. గతంలో కూడా అతను పలు ప్రాంతాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఏ2గా ఉన్న మారేడుపూడి గ్రామానికి చెందిన చప్పిది నూకరాజు పాత్రపై విచారణ కొనసాగుతోందని సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బంగారు హారం–1, బంగారు నెక్లెస్‌లు–2, పెద్ద బంగారు గొలుసు–1, చిన్న బంగారు గొలుసులు–3, బంగారు లాకెట్లు–2, చెవి దిద్దులు–3 జతలు, బంగారు ఉంగరాలు–10, బ్రాస్‌లెట్–01, పాపిడి బిళ్ల–1, రూ.5300 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన క్రైం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

మెరుగు పేరుతో ఘరానా మోసం