
తల్లికి వందనం.. కలెక్టరేట్‌కు క్యూ
మహారాణిపేట: ‘తల్లికి వందనం’పథకం లబ్ధి కోసం తల్లులు అష్టకష్టాలు పడుతున్నారు. తమకు అర్హత ఉన్నప్పటికీ నగదు ఖాతాల్లో జమ కాలేదంటూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఫిర్యాదులు చేశారు. సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ కుమార్, సమగ్ర శిక్ష అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల ఇన్‌చార్జి ఉషారాణిలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు, సిబ్బంది వెంటనే కలెక్టరేట్‌లోనే ల్యాప్‌టాప్‌లతో లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు.
కొర్రీలతో లబ్ధిదారుల కోత
ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా చాలా మందికి ఈ పథకం అందకుండా పోయింది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద 25శాతం కోటాలో ఉచిత సీటు పొందిన విద్యార్థుల తల్లులకు ఈ పథకాన్ని నిలిపివేశారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండి, ఒకరికి ఉచిత సీటు వస్తే, రెండో బిడ్డకు తల్లికి వందనం వర్తింపజేయలేదు. అంతేకాకుండా, నెలవారీ విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటినా లేదా ఇతర ప్రభుత్వ పథకాలు పొందుతున్నా అనర్హులుగా ప్రకటించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచిత సీట్లు పొందిన విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారని, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీకి విరుద్ధంగా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకే ఇలాంటి కఠిన నిబంధనలు తీసుకొచ్చిందని పలువురు తల్లులు ఆరోపించారు. తమకు ఉచిత సీటు రాకపోయినా, ఆన్‌లైన్‌లో వచ్చినట్లుగా తప్పుగా చూపిస్తూ పథకాన్ని నిలిపివేస్తున్నారని మరికొందరు వాపోయారు.
ఇది మూడోసారి..
నాకు ఇద్దరు పిల్లలు. ప్రభుత్వ పాఠశాల్లోనే చదువుతున్నారు. అయినా తల్లికి వందనం రాలేదు. సచివాలయం చుట్టూ తిరిగినా ఎవరూ సరైన కారణం చెప్పడం లేదు. కలెక్టరేట్‌కు రావడం ఇది మూడోసారి. ఇప్పుడు నా భర్త జి.రమణ పేరు మీద రెండు కరెంట్ మీటర్లు ఉన్నాయని చెబుతున్నారు. మాకు ఉన్నది చిన్న ఇల్లు మాత్రమే. ఆ రెండో మీటర్ ఎక్కడిదో విచారణ చేయాలి. దయచేసి నా పిల్లలకు న్యాయం చేయండి.
– గరికిన సింహాచలం, దిబ్బపాలెం, పెదగంట్యాడ
న్యాయం చేయాలని పీజీఆర్‌ఎస్‌లో వినతులు

తల్లికి వందనం.. కలెక్టరేట్‌కు క్యూ