
కోర్టు కేసుల్లో అలసత్వం వద్దు
మహారాణిపేట: కోర్టు కేసుల విషయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, నిర్ణీత సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు కాలయాపన చేయకుండా ఎప్పటి ఫైళ్లను అప్పుడే పరిష్కరించాలని స్పష్టం చేశారు. పీ–4 పథకంలో భాగంగా జిల్లాలో గుర్తించిన 64 వేల బంగారు కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశించారు. తొలి దశలో వారిలో పది శాతం మందికై నా ప్రాథమిక అవసరాలను గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఆర్థికపరమైన అంశాలతోపాటు, సామాజిక అంశాల్లో వారికి ప్రత్యేక సాయం అందించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ఈ బంగారు కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖల పరిధిలో చేసిన సాయం, ఇతర అంశాలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు సీపీవోకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించడానికి అధికారులంతా సమష్టి కృషి చేయాలని కలెక్టర్ నిర్దేశించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోని అంశాలను ఆధారంగా చేసుకొని.. జిల్లా అభివృద్ధికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. ఆయా శాఖల పరిధిలో చేపట్టబోయే ప్రగతిశీల పనులకు సంబంధించి మూడు నెలలు, ఏడాదికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.