
యూరియా సరఫరాపై కేంద్రాన్ని బద్నాం చేయడం మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు
పెద్ద రైతులు ఎక్కువ యూరియా నిల్వ చేసుకోవద్దని వినతి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణకు పంపుతున్న యూరియా పక్కదారి ఎలా పడుతోందో, ఎలా బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్తోందో సమాధానం చెప్పాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క బస్తా కూడా అధిక ధరలకు అమ్మకుండా చూడాలని.. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యూరియా సరఫరా విషయంలో కేంద్రాన్ని బద్నాం చేసే దురుద్దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు.
రైతులకు సక్రమంగా యూరియా సరఫరా అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో 2.04 లక్షల టన్నుల యూరియా ఖరీఫ్ సీజన్ కోసం ఓపెనింగ్ స్టాక్‌గా ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు విత్తనాలు వేయక ముందే రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం యూరియా సరఫరా చేయడం లేదని ప్రకటించి భయానక వాతావరణాన్ని సృష్టించిందని మండిపడ్డారు. ఇతర దేశాల్లో ఎరువుల ధరలు మూడు రెట్లు పెరిగినప్పటికీ కేంద్రం 11 ఏళ్లుగా రైతులపై భారం వేయకుండా రాష్ట్రానికి సుమారు రూ. 80 వేల కోట్ల ఎరువుల సబ్సిడీని భరించిందన్నారు.
రూ. 2,650 విలువైన ఒక్కో యూరియా బస్తాను రూ. 265 సబ్సిడీ ధరకే రైతులకు అందిస్తుంటే దాన్ని రూ. 400కి వారు కొనాల్సిన పరిస్థితి ఎందుకొస్తోందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. అసలు కుట్ర ఎవరిదో బదులివ్వాలని నిలదీశారు. పెద్ద రైతులు వారి దగ్గర ఎక్కువ యూరియా ఉంచుకోవద్దని.. అవసరమైన యూరియాను అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు.
సచివాలయం వద్ద నిరసనలకు భయమెందుకు?
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏటా సెపె్టంబర్ 17న ‘తెలంగాణ లిబరేషన్ డే’ను హైదరాబాద్‌లో నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ ఏడాది కూడా తెలంగాణ విముక్తి దినాన్ని కేంద్రం తరఫున ఘనంగా నిర్వహిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజాసమస్యలు, నగరాభివృద్ధి అంశాలపై బీజేపీ ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట నిరసన చేపడితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉలికిపాటు, భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలను అదుపులోకి తీసుకోవడం, హౌస్ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లో మౌలిక సమస్యల పరిష్కారానికి జైలుకెళ్లేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల మేరకు ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సెపె్టంబర్ 1 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేసే పోరాటానికి బీజేపీ రాష్ట్రశాఖ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల లోపు సిపార్సులను అన్నీ అమలు చేస్తామని ఇచి్చన హామీ అటకెక్కిందని విమర్శించారు.
ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించేవిధంగా హెల్త్ కార్డులు ఇస్తామన్న ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ప్రస్తుతం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేస్తామన్న హామీ అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ మొత్తాల విత్‌డ్రాపైనా మారిటోరియం విధించడం దారుణమన్నారు.