
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై భేటీలో బీఆర్‌ఎస్ నిర్ణయం
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలకు బాధ్యతలు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం
మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, జగదీశ్‌రెడ్డి హాజరు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ కీలక నేతలు మంగళవారం భేటీ అయ్యారు. నందినగర్ నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో పార్టీ పరంగా అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై ప్రాథమికంగా చర్చించినట్లు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బుధవారం హైకోర్టు వెలువరించే తీర్పు ఆధారంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహానికి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పక్షంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. బూత్‌లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు ప్రతికూలంగా స్పందిస్తే ఇతర ప్రాంత నేతలకు కూడా జూబ్లీహిల్స్‌లో పార్టీ తరపున బాధ్యతలు అప్పగించే అవకాశముంది. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చిన రీతిలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఇతర జిల్లాలకు చెందిన పార్టీ నేతలను ప్రచార పర్వంలో మోహరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
నేడు మరోమారు భేటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇచ్చేందుకు బుధవారం బీఆర్‌ఎస్ కీలక నేతలు మరోమారు భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం. కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఒకరిద్దరు కీలక నేతలు కూడా పాల్గొంటారు.
ఇప్పటికే పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినందున ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, హాల్ మీటింగ్స్ ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ షెడ్యూల్‌పై చర్చిస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనే ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశముంది.
ఆర్టీసీ ప్రైవేటీకరణకు యత్నం
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఇన్నోవేటివ్ థింకింగ్’ పేరిట ఆర్టీసీ బస్సుల్లో భార్యకు ఫ్రీ టికెట్ ఇస్తూ భర్త నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని, అలాగే పిల్లల బస్‌పాస్‌ల రేట్లు పెంచారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చార్జీల పెంపు ద్వారా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేసుకుంటోందని విమర్శించారు. చార్జీల పెంపుతో ఒక్కో కుటుంబంపై 20 శాతం మేర అదనపు భారం పడుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం మార్గం సుగమం చేసుకుంటూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తోందన్నారు. హైదరాబాద్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కనందునే ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు చార్జీలు పెంచిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చార్జీల పెంపునకు కాంగ్రెస్ పార్టీ ప్రతిఫలాన్ని అనుభవిస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు.