
పరిటాల దోపిడీకి సరిలేరెవ్వరూ
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల వారి దోపిడీకి ఎవరూ సరిలేరని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మవరం, అనంతపురం, చెన్నేకొత్తపల్లిలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రోజూ రూ. 25 లక్షలు పరిటాల ఇంటికి వెళ్తోందన్నారు. నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్‌షాపులు ఉండగా.. నిత్యం ఒక్కో షాపు నుంచి రూ. 2 వేలు పరిటాల కుటుంబం పేరుతో వసూలు చేస్తున్నారన్నారు. చివరకు నసనకోట ముత్యాలమ్మ గుడినీ వదల్లేదని, అక్కడి బెల్ట్‌షాపు నుంచి రోజూ రూ. లక్ష వెంకటాపురంలోని పరిటాల ఇంటికి వెళ్తోందన్నారు. కంకర మిషన్లకు సంబంధించి ఒక్కో క్రషర్‌కు ప్రతినెలా రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు.
ధర్మవరంలో బలవంతపు వసూళ్లు
ధర్మవరంలో చేనేతలు, వైశ్యుల నుంచి రూ. కోట్లు అక్రమంగా వసూళ్లు చేశారని ఆరోపించారు. చేనేతలు తమ కులస్తుడైన కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ వద్ద మొరపెట్టుకుంటే ‘ఏ నా కొడుక్కీ రూపాయి కట్టొద్దండి. నేను అండగా ఉంటా’ అని ఆయన వారికి హామీ ఇచ్చాడన్నారు. తర్వాత సఖ్యత కుదుర్చుకుని సర్దుబాటు చేసుకున్నారని ఆరోపించారు. పరిటాల కుటుంబీకులకు వెంకటాపురంలో కాకుండా అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు, ధర్మవరంలో ఉన్న భవనాల విలువ రూ. 150 కోట్లు అని, ఇవికాకుండా వారికున్న కాంప్లెక్స్ భవనాలు, కియా వద్ద భూములు, గ్రానైట్ క్వారీల గురించి మాట్లాడడం లేదన్నారు. ఆదాయం ఎక్కువైపోయి హైదరాబాద్, బెంగళూర్‌లో పబ్‌లు కూడా ఏర్పాటు చేశారని, ఇవికూడా చాలవన్నట్లు అమెరికాలో రెండు, ఆఫ్రికాలో ఒకచోట లిక్కర్ ఫ్యాక్టరీలు తెరిచారన్నారు. అక్రమ ఆదాయంతోనే నేడు పరిటాల సునీత రూ. 3 కోట్ల విలువైన బెంజి కారులో తిరుగుతోందన్నారు. ‘సునీతమ్మా.. తోపుదుర్తిలో మహిళలు నీ మీద రెండు ట్రాక్టర్ల చెప్పులు విసిరారు. 2 వేలమంది పోలీసులతో వచ్చినా ఆరు గంటలపాటు గ్రామంలోకి రాలేకపోయావు. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో 164 మంది ఎమ్మెల్యేల కంటే నీకే బాగా తెలుసు. 50 వేల మంది ఇళ్ల నిర్మాణాలు జరగకుండా ఆపినావు. ఆ 50 వేలమంది కాళ్లల్లో ఉన్న చెప్పులు విసిరితే ఆ గుట్టలో నువ్వు కనిపిస్తావా?’ అని మండిపడ్డారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, అనంతపురం, రాప్తాడు వైస్ ఎంపీపీలు కృష్ణారెడ్డి, బోయ రామాంజి, నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, బండి పవన్, లింగారెడ్డి, ఆలమూరు ఓబులేసు, శేఖర్, సత్తిరెడ్డి, మాదన్న, మునిశంకరయ్య, ఈశ్వరయ్య, మీనుగ నాగరాజు పాల్గొన్నారు.
టమాట మండీల్లో రోజూ రూ. 5 లక్షలు శ్రీరామ్ ట్యాక్స్
మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి నిత్యం రూ. 25 లక్షలు
అక్రమ సొమ్ముతోనే పరిటాల సునీత బెంజి కారులో తిరుగుతోంది
తోపుదుర్తిలో రెండు ట్రాక్టర్ల చెప్పులు వేసిన సంగతి గుర్తు లేదా?
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి