
లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రశాంతి నిలయం: గృహ నిర్మాణ శాఖ లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గృహనిర్మాణ సంస్థ అధికారులలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా ఇంటి స్థలాలు లేని వారు, స్థలం ఉండి ఇల్లు మంజూరు అయినా కట్టని వారి జాబితాలు వెంటనే సిద్ధం చేయాలన్నారు. రామగిరి, కదిరి అర్బన్, గోరంట్ల, ధర్మవరం అర్బన్, పెనుకొండ, సోమందేపల్లి, కనగానపల్లి మండలాల్లో జీరో పురోగతి ఉందని, వారి పనితీరు మెరుగుపరుచుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తయిన ప్రతి ఇంటికీ మరుగుదొడ్ల నిర్మాణం తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, ధర్మవరం డీఈ లక్ష్మినారాయణమ్మ, పుట్టపర్తి, రాప్తాడు, పెనుకొండ, ధర్మవరం ఈఈలు శ్రీనివాసులు, శంకర్‌లాల్‌నాయక్, శివకుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
మెగా జాబ్‌మేళా సద్వినియోగం చేసుకోండి
ప్రశాంతి నిలయం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 15 బహుళజాతి కంపెనీలతో ఈ నెల 10న హిందూపురంలో నిర్వహించే మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ కోరారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో జాబ్‌మేళా పోస్టర్లను విడుదల చేశారు. హిందూపురంలోని ఎస్‌డీజీఎస్ ఎంబీఏ కాలేజీలో శుక్రవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డిగ్రీ, పీజీ, బీటెక్ చదివి 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు జాబ్‌మేళాకు హాజరుకావచ్చన్నారు. ఎంపికై న అభ్యర్థులకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 96767 06976, 99594 16770 నంబర్లలో సంప్రదించాలన్నారు.