మసిపూసి.. మారేడు కాయ చేసి! | - | Sakshi
Sakshi News home page

మసిపూసి.. మారేడు కాయ చేసి!

Oct 8 2025 6:33 AM | Updated on Oct 8 2025 6:33 AM

మసిపూసి.. మారేడు కాయ చేసి!

మసిపూసి.. మారేడు కాయ చేసి!

అనంతపురం సెంట్రల్‌: మహిళాశిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహ అవినీతికి కేరాఫ్‌గా మారింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అక్రమాలకు పాల్పడడమే కాకుండా సాక్ష్యాలను సైతం తారుమారు చేయడంలో సిద్ధహస్తులనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తాజాగా నవజాత శిశువు మృతి విషయంలోనూ సాక్ష్యాలు తారుమారు చేస్తున్నట్లు మహిళాశిశు సంక్షేమ శాఖలోని కొందరు అధికారులే బాహాటంగా పేర్కొంటున్నారు. శిశువు మృతి చెందిన రోజు ఏం జరిగిందనే విషయంపై సీసీ కెమెరా ఫుటేజీలు నేటీకి బయటపెట్టక పోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఒకసారి.. రికార్డు కావడం లేదని మరోసారి పొంతనలేని సమాధానాలతో విచారణాధికారులను సైతం పక్కదోవ పట్టించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 3న శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ శిశువు మృతి చెందినట్లుగా సిబ్బంది బుకాయిస్తున్నారు. వాస్తవానికి శిశుగృహలోనే శిశువు మృతి చెందాడని, ఈ విషయం తెలిస్తే ఇబ్బందులు తప్పవని భావించిన శిశుగృహ సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీలను బయట పెట్టకుండా విచారణాధికారులను పెడదోవ పట్టిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలోనూ తిమ్మిని బమ్మిని చేసి..

గతంలోనూ దత్తత అంశంలో తలెత్తిన వివాదంలో సాక్ష్యాలను తారుమారు చేసినట్లుగా శిశుగృహ సిబ్బందిపై ఆరోపణలున్నాయి. కెనడా దేశానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ మహిళ దత్తత కోసం రాగా ఆమె నుంచి తొలుత రూ. 3 లక్షలు... ఆ తర్వాత బంగారాన్ని డిమాండ్‌ చేయడాన్ని ఆక్షేపిస్తూ కేంద్ర రాయబార కార్యాలయానికి ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అప్పటి జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ తక్షణ విచారణ చేపట్టి వాస్తవాలు నిర్ధారించుకున్న అనంతరం శిశుగృహ మేనేజర్‌ను విధుల నుంచి తొలగించారు. అయితే సదరు ఎన్‌ఆర్‌ఐ మహిళ ఫిర్యాదులను, కలెక్టర్‌ జారీ చేసిన టెర్మినేట్‌ ఉత్తర్వులకు సంబంధించిన ఫైల్స్‌లో కొన్ని మాత్రమే ఉంచి కీలకమైన సమాచారాన్ని మాయం చేశారు. ఫలితంగా కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తిరిగి మళ్లీ అదే స్థానానికి మేనేజర్‌ చేరుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వెంటనే సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్సు అథారిటి(కారా) వెబ్‌సైట్‌ ద్వారా దత్తత పొందేలా మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌ చేసింది. అంతకు మునుపు ఆఫ్‌లైన్‌ విధానంలో ఇష్టానుసారంగా దత్తతకు ఇచ్చి భారీగానే సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

శిశుగృహ మేనేజర్‌ ఏం చేస్తున్నట్లు?

శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సంరక్షణ బాధ్యత మొత్తం సంబంధిత మేనేజర్‌పైనే ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితుల్లోనైనా 24 గంటలూ సేవలందించాల్సి ఉంటుంది. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులతో చికిత్సను అందించాలి. అవసరమైతే అక్కడే అడ్మిట్‌ చేయడం.. ప్రత్యేకంగా ఆయాను నియమించి కోలుకునేంత వరకూ చికిత్సనందించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ఇటీవల శిశువు మృతి చెందే వరకూ కూడా మేనేజర్‌ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. 3న అర్ధరాత్రి విధుల్లో ఉన్న ఒకే ఆయా శిశువు పరిస్థితిని ఫోన్‌ ద్వారా తెలిపినా మేనేజర్‌ స్పందించలేదని తెలిసింది. దీంతో ఐదుగురు చిన్నారులను వదిలేసి శిశువును తీసుకుని సర్వజనాస్పత్రికి ఆయా ఒక్కరే వెళ్లింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి వెనక్కు పంపినట్లు ఐసీడీఎస్‌ అధికారులు తెలిపారు.

అక్రమాలకు అధికారి అండ!

శిశువు మరణానికి బాధ్యులైన వారిని రక్షించేందుకు ఓ అధికారి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గతంలో అక్రమాలకు పాల్పడి టెర్మినేట్‌ అయిన సమయంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి తిరిగి శిశుగృహలో బాధ్యతలు స్వీకరించేలా చేసిన సదరు అధికారి ప్రస్తుతం కూడా అవినీతి అధికారిని రక్షించే బాధ్యతలను భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శిశువు శిశుగృహలోనే మృతి చెందిన అంశాలున్న సీసీ కెమెరా ఫుటేజీలను తొక్కి పెట్టించినట్లు ఆరోపణలున్నాయి. అనారోగ్యంతో శిశువు మృతి చెందినట్లుగా మెడికల్‌ సర్టిఫికెట్‌ సృష్టించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

శిశు మరణంపై సాక్ష్యాలు తారుమారు?

ఇప్పటి వరకూ బయటపెట్టని సీసీ కెమెరా ఫుటేజీలు

గతంలోనూ ఇదే తరహాలో

కీలక ఫైళ్ల మాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement