
అనాథ బాలుడిని అక్కున చేర్చుకున్న ఖాకీ
కొత్తచెరువు: అనాథ బాలుడిని అక్కున చేర్చుకుని స్థానిక పీఎస్ సీఐ జి.మారుతీశంకర్ మానవత్వాన్ని చాటారు. వివరాలు... గస్తీలో భాగంగా మంగళవారం రాత్రి కొత్తచెరువులోని నెహ్రూ సర్కిల్ వద్దకు చేరుకున్న సీఐ మారుతీశంకర్ అక్కడ ఒంటరిగా తచ్చాడుతున్న 12 ఏళ్ల బాలుడిని గుర్తించి, దగ్గరకు పిలుచుకుని ఆరా తీశారు. కొత్తచెరువు మండలం నాగిరెడ్టిపల్లికి చెందిన అంజి కుమారుడు ఎనుముల రాజశేఖర్‌గా గుర్తించారు. తల్లిదండ్రులిద్దరూ మృతిచెందడంతో అనాథగా రోడ్లపై తిరుగుతున్నట్లుగా బాలుడు పేర్కొనడంతో సీఐ మారుతీశంకర్ చలించిపోయారు. అలాగే రోడ్డుపై వదిలేస్తే వ్యసనాలకు బానిసవుతాడని భావించిన ఆయన.. వెంటనే తన వాహనంలో బాలుడిని ఎక్కించుకుని పీఎస్‌కు చేర్చారు. బుధవారం ఉదయం బార్బర్‌ను పిలిపించి శుభ్రంగా కటింగ్ చేయించారు. నూతన దుస్తులను ఇప్పించారు. అనంతపురంలోని చైల్డ్‌వెల్ఫేర్ కార్యాలయాన్ని సంప్రదించి, వారి ద్వారా కడపలోని అనాథ శరణాలయంలో ఆశ్రయం, చదువులు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. సకాలంలో బాలుడి భవిష్యత్తు అంధకారం కాకుండా కాపాడిన సీఐ మారుతీశంకర్ చొరవను స్థానికులు తెలుసుకుని అభినందించారు.