
త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం భారత జట్టును మరి కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. జట్టు ప్రకటనకు ముందు సెలెక్టర్లు పెద్ద సైజు కసరత్తే చేస్తున్నారు. ఆటగాళ్ల ఎంపిక రొటీన్ ప్రక్రియలా లేదు. 15 బెర్త్‌ల కోసం 20 మంది అర్హులు పోటీపడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలో, ఎవరిని వదిలేయాలో తెలీక సెలెక్టర్లు తలలు పట్టుకున్నారు.
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్, మొహమ్మద్ షమీ లాంటి టీ20 స్టార్లతో ఇప్పటికే జట్టు పటిష్టంగా ఉండగా.. కొత్తగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ సిరాజ్, బుమ్రా, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లను అకామడేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వీరంతా (శ్రేయస్ మినహా) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి ఫామ్‌ను బట్టి ఆసియా కప్‌కు తప్పక ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా ఆసియా కప్ ఆడేందుకు సంసిద్దత కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇదివరకే సెట్ అయిన ఆటగాళ్లను కదిలిస్తారా లేక టెస్ట్ హీరోలను ఎంపిక చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో సెలెక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
టెస్ట్ జట్టు కెప్టెన్ గిల్, అతని గుజరాత్ టైటాన్స్ సహచరుడు కూడా అయిన సిరాజ్‌ను అకామడేట్ చేయడం వారి ముందున్న ప్రధాన సమస్య. గిల్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తేవాలంటే సెట్ అయిన ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలలో ఎవరో ఒకరిని కదిలించాలి. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది ఆమోదయోగ్యమైంది కాదు. ఒకవేళ కదిలించినా అది పెద్ద సాహసమే అవుతుంది.
అలాగని గిల్‌ను పక్కకు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఓపెనింగ్ కాకుండా వేరే ఏదైన స్థానంలో అయిన ఆడిద్దామా అంటే ఎక్కడా ఖాళీలు లేవు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం సెట్ అయిపోయింది. వన్ డౌన్‌లో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో సూర్యకుమార్, ఆతర్వాత దూబే, హార్దిక్, రింకూ ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఆక్రమించబడింది.
వీరిలో ఏ ఒక్కరినీ కదిలించే పరిస్థితి లేదు. వీరు ఇటీవలికాలంలో అద్భుతంగా రాణించి జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించారు. పొట్టి ఫార్మాట్‌లో వీరందరికి తిరుగులేని కూడా రికార్డు ఉంది. ర్యాంకింగ్స్‌లో కూడా వీరు టాప్‌లో ఉన్నారు. వీరిని జట్టులో కొనసాగించడం సమంజసమే అయినప్పటికీ.. అంతే అర్హత కలిగిన గిల్, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లను కూడా కాదనలేని పరిస్థితి.
ఈ తల నొప్పులు బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. బౌలింగ్ విభాగంలోనూ ఉన్నాయి. అయితే తీవ్రత బ్యాటింగ్‌లో ఉన్నంత లేదు. షమీ స్థానంలో బుమ్రా ఎంట్రీకి ఎలాంటి సమస్య లేనప్పటికీ.. కొత్తగా సిరాజ్‌ను అకామడేట్ చేయడమే సమస్య.
అర్షదీప్, బుమ్రా ఫస్ట్ ఛాయిస్ పేసర్లు కాగా.. మూడో పేసర్ స్థానం కోసం సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, షమీ పోటీపడుతున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్‌కు అకామడేట్ చేయడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందిగానే ఉంది.
ఇన్ని తలనొప్పుల మధ్య సెలెక్టర్లు ఎవరెవరిని ఎంపిక చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్ట్ 19న జట్టును ప్రకటించే అవకాశం ఉంది.