
అవగాహనే రక్ష
రోజు రోజుకు సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. అవగాహన ఉంటే సైబర్ ఉచ్చులో పడకుండా ఉంటారని, ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు.
– పటాన్‌చెరు టౌన్
సాఫ్ట్‌వేర్, ప్రైవేట్, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారిని సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాగే ఇతర దేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఫోన్ చేసి మీ అబ్బాయి కేసుల్లో ఇరుక్కున్నాడని.. డబ్బులు చెల్లించాలని లింకులు పంపి ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నారు. క్రైమ్ జరిగిన గంటలోనే (గోల్డెన్ హవర్) బాధితులు ముందుగా 1930కు కాల్ చేసి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సమాచారం ఇవ్వాలి. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులకు, అనంతరం వారి పరిధిలోకి వచ్చే పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయాలి. వెంటనే సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి డబ్బులు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 178 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కాగా బాధితులు మొత్తం 4.15 కోట్లు పోగొట్టుకున్నారు.
ఇలా మోసపోతున్నారు..
● పార్ట్ టైం జాబ్ పేరుతో టాస్కులు ఇస్తూ, నగదు ఇన్వెస్ట్ చేయిస్తూ, అధిక డబ్బు సంపాదించవచ్చని.
● ఏటీఎం కార్డు, డెబిట్ కార్డ్ అప్డేట్ చేయాలని వివరాలు సేకరించి బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయం చేస్తున్న ఘటనలు అనేకం.
● ఆన్‌లైన్ ఉద్యోగాలంటూ ఫోన్‌కు వచ్చిన లింకులు క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్న వారు కొందరు.
● ఫేస్ బుక్‌లో వాహనాలు, సెకండ్ హ్యాండ్ వస్తువుల ప్రకటనలు క్లిక్ చేసి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు.
కొన్ని ఘటనలు
● పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి సెప్టెంబర్ 15న తన ఫోన్‌కు టాస్కులు చేస్తే కమీషన్ ఇస్తామని గుర్తుతెలియని మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. దానికి స్పందించి తన వివరాలు నమోదు చేయగా... వారు వాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి నగదు చెల్లించి టాస్కులు చేశాడు. దీంతో బాధితుడు మొత్తం రూ.47 లక్షల 67 వేలు చెల్లించాడు. కాగా పెట్టిన నగదును ఇవ్వాలని అడగగా అవుతలి నుంచి స్పందన లేదు.
● ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తికి సెప్టెంబర్ 19న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పాడు. దీంతో బాధితుడు కార్డు వివరాలు చెప్పాడు. లిమిట్ పెంచామని.. మీకు ఓటీపీ వస్తుంది అది చెప్పాలని సూచించాడు. నిజమని నమ్మి చెప్పగా వెంటనే అతడి ఖాతా నుంచి రూ. రెండు లక్షల 19 వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.
అవగాహన కల్పిస్తున్నాం
బాధితులు గోల్డెన్ అవర్‌లోనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుంది. దోచుకున్న నగదును బ్లాక్ చేస్తారు. సైబర్ నేరాలపై విద్యాసంస్థల్లో యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
– వేణుగోపాల్ రెడ్డి,
డీఎస్పీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో
ఓ పరిశ్రమలో కార్మికులకు అవగాహన
కల్పిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు
1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి
జనవరి నుంచి ఇప్పటి వరకు 178 కేసులు
ఆన్‌లైన్ జాబ్స్, ఫోన్‌కాల్స్‌తో బురిడీ