
లక్షలాది రైతులకు పత్తి జీవనాధారం
దుబ్బాకటౌన్: పత్తి పంట ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు జీవనాధారమవుతుందని, వ్యవసాయం నుంచి వస్త్ర పరిశ్రమ వరకు అనేక రంగాల్లో ఉపాధి కల్పిస్తుందని భారత నవ నిర్మాణ సంస్థ కో ఆర్డినేటర్ దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం రామారం గ్రామంలో ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచ వాణిజ్య సంస్థ 2019లో మొదటిసారి ప్రపంచ పత్తి దినోత్సవం ప్రారంభించిందన్నారు. పత్తితో మనకు వస్త్రాలు మాత్రమే కాకుండా, విత్తన నూనె, పశువుల ఆహారం వంటి అనేక ఉత్పత్తులు లభిస్తున్నాయని గుర్తు చేశారు. పత్తి సహజమైన పంట కావడం వల్ల పర్యావరణానికి మేలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కల్పన, ఫీల్డ్ ఫెసిలిటీర్స్ కరుణాకర్, శ్రీకాంత్, వినోద్ రెడ్డి తదితరులున్నారు.