
విద్యార్థి అనుమానాస్పద మృతి
హుస్నాబాద్: ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని జిల్లెల్లగడ్డ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నంగునూరు గ్రామానికి చెందిన సనాధుల వివేక్ (13) 8వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల అనంతరం విద్యార్థి సోమవారం పాఠశాలకు వచ్చాడు. మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత వివేక్ పాఠశాలలోని రెండో అంతస్తులో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో క్లీనింగ్ చేసి ఫ్లోర్ పదునుగా ఉండటంతో జారిపడి ప్రమాదవశాత్తు రెయిలింగ్‌కి ఉన్న నైలాన్ దారం తన మెడకు చుట్టుకుందని.. ఉపాధ్యాయులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా వివేక్‌ది హత్య అని , ఉపాధ్యాయులు పొంతన లేని సమాధానం చెబుతున్నారని మృతుని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హుస్నాబాద్ – హన్మకొండ హైవేపై ధర్నా చేశారు. ఘటనా స్థలానికి ఏసీపీ సదానందం చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. కాగా విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.