
వేధింపులు భరించలేకే హత్య
● రౌడీషీటర్ హత్యకేసులో ముగ్గురు అరెస్ట్
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ
రామాయంపేట(మెదక్): రౌడీషీటర్ హత్యకేసులో వరుసకు సోదరులైన వారే నిందితులని పోలీసులు తేల్చారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో సోమవారం హత్య జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. శాలిపేట గ్రామానికి చెందిన ఉప్పరి యాదగిరి (46)కి గతంలో కొన్ని కేసులతో సంబంధం ఉంది. వరుసకు సోదరులైన ఉప్పరి శ్యాములు, ఉప్పరి రాములు, ఉప్పరి ఎల్లంను తరచూ వేధింపులకు గురిచేస్తూ చంపుతానని యాదగిరి బెదిరించేవాడు. దీంతో అతడు జీవించి ఉంటే తమను బతుకనివ్వడని, ఎలాగైనా హతమార్చాలని ముగ్గురు కలిసి మూడు రోజుల క్రితం కల్లు దుకాణంలో ప్లాన్ చేశారు. అదే రోజు అతని కోసం గాలించగా దొరకలేదు. సోమవారం ముగ్గురు నిందితులు కల్లు దుకాణంలో కల్లు తాగిన అనంతరం నేరుగా యాదగిరి ఇంటికి వెళ్లారు. ఇంటిముందు ఉన్న అతడ్ని పట్టుకుని కింద పడేసి తలపై బండరాళ్లతో బాది హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు. ముగ్గురు నిందితులు పారిపోతున్న క్రమంలో గవ్వలపల్లి చౌరస్తా వద్ద స్థానిక సీఐ వెంకట్‌రాజాగౌడ్ పట్టుకొని విచారించగా, నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించారు.