
కాంగ్రెస్‌లో కలహాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు ఈ ఎన్నికల సందర్బంగా రచ్చకెక్కుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సంసిద్ధం చేసేందుకు మండలాల వారీగా నిర్వహించే సన్నాహాక సమావేశాల విషయంలో జహీరాబాద్ నియోజకవర్గంలో రాజుకున్న రచ్చ ఏకంగా రాష్ట్ర అధినాయకత్వమే కలగజేసుకునే పరిస్థితికి చేరింది. ఈ పంచాయితీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి వద్దకు వెళ్లింది. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, ఇతర ముఖ్య నాయకులు ఈ నియోజకవర్గం నాయకులను సమన్వయం చేయాల్సి వచ్చింది.
సస్పెన్షన్ల ప్రకటన చిచ్చు..
జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆ నియోజకవర్గం ఇన్‌చార్జి చంద్రశేఖర్ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనపై మరో వర్గం భగ్గుమంది. పార్టీ మండల అధ్యక్షుడిని సస్పెండ్ చేసే అధికారం నియోజకవర్గం ఇన్‌చార్జికి ఎక్కడిదని సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్‌రెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది. పైగా ఏళ్ల తరబడి పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకుడిని ఈ ఎన్నికల సందర్భంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తే పార్టీ శ్రేణుల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయని మండిపడుతోంది. ఒక మండల అధ్యక్షుడిని సస్పెండ్ చేసే అధికారం పీసీసీ అధ్యక్షుడికే ఉంటుంది. ఏదైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు క్రమశిక్షణ కమిటీ నిర్ణయిస్తేనే పీసీసీ అధ్యక్షుడు చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. కానీ నియోజకవర్గం ఇన్‌చార్జి ఎలా సస్పెన్షన్ ప్రకటన ఇస్తారని భగ్గుమంటోంది. నర్సింహారెడ్డిని పార్టీ నుంచి తొలగించలేదని, ఎలాంటి సస్పెన్షన్ ఉండదని మంత్రి వివేక్‌తో జరిగిన సమావేశం అనంతరం నాయకత్వం ప్రకటించింది.
సమన్వయంతో సమావేశాలు..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మండలాల వారీగా సమావేశాలు జరుగుతున్నా యి. ఈ నియోజకవర్గంలోని నాయకులను ఇన్‌చార్జి మంత్రి వివేక్ సమన్వయం చేయడంతో ఈ సమావేశాలకు ఇప్పుడు చంద్రశేఖర్‌తోపాటు, గిరిధర్‌రెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఇటీవల మొగుడంపల్లి మండల సమావేశానికి ఇరు వర్గాల నాయకులు హాజరయ్యారు. అలాగే జహీరాబాద్ మండల సమావేశానికి కూడా రెండు వర్గాల నాయకులు పాల్గొన్నారు.
పాత, కొత్త నేతల మధ్య పోరు
ఈ నియోజకవర్గంలో పాత, కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత పదేళ్లు ఇక్కడ గిరిధర్‌రెడ్డి వర్గం పార్టీని అంటిపెట్టుకుని ఉంటోంది. కాంగ్రెస్ కష్ట కాలంలోనూ తాము పార్టీకి అండగా నిలిచామని, తీరా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు తమపై ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తున్నారని మండిపడుతోంది. ఈ పంచాయితీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వద్దకు వెళ్లడంతో ఇరు వర్గాలను హైదరాబాద్‌లోని తన నివాసానికి పిలిపించి సమన్వయం చేయాల్సి వచ్చింది.
ఇన్‌చార్జి మంత్రి వివేక్ వద్దకు
‘జహీరాబాద్’ పంచాయితీ
‘స్థానిక’ఎన్నికల వేళ రచ్చకెక్కుతున్న
నేతల ఆధిపత్య పోరు
ఇరువర్గాలను సమన్వయం చేసిన
మంత్రి వివేక్