
వాల్మీకి మార్గంలో నడుచుకోవాలి: ఎస్పీ
సంగారెడ్డి జోన్: వాల్మీకి చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరు నడుచుకోవాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసుల ఉన్నతాధి కారులతో సమీక్ష నిర్వహించారు.
అక్రమ రవాణా జరగకుండా చర్యలు
స్థానిక ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యంతోపాటు డబ్బు అక్రమంగా రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిని బైండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్ రాములు, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, వెంకటరెడ్డి, సైదా నాయక్ పాల్గొన్నారు.
పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ
కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డిటౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శిశుగృహ, సఖి కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులు క్రమశిక్షణతో ఉంటూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. న్యాయపరమైన విషయంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రోడ్లు మరమ్మతు చేయండి
నారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షాలకు బాగా దెబ్బతిని ప్రమాదకరంగా మారిన రోడ్లు, వంతెనలకు వెంటనే మరమ్మతులు చేయించాలని కోరుతూ మంగళవారం ఖేడ్ మాజీ జెడ్పీటీసీ రాథోడ్ రవీందర్ నాయక్ ఖేడ్‌సబ్ కలెక్టర్ ఉమాహారతికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం వినతి పత్రాన్ని సబ్‌కలెక్టర్‌కు అందజేశారు. సోమవారం కురిసిన కుండపోత వర్షం కారణంగా ఖేడ్–సిర్గాపూర్ మార్గంలోని ర్యాకల్–చల్లగిద్ద తండాల మధ్య రోడ్డుతోపాటు, ర్యాకల్ సమీపంలోని వంతెన వద్ద గొయ్యిపడి ప్రమాదకరంగా మారిందని వివరించారు. ర్యాకల్ నుంచి పోతన్‌పల్లి వైపు వెళ్లే రోడ్డు సైతం బాగా దెబ్బతిందని తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో నాయకులు చౌహాన్ సర్దార్ నాయక్, తదితరులు ఉన్నారు.
ఎన్‌ఎంఎంఎస్‌ఎస్ దరఖాస్తు
గడువు పొడిగింపు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్ (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్)కు 2025–26 విద్యాసంవత్సరంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 14వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఎంఈఓ శంకర్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులని తెలిపారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు రూ.50, బీసీలు, ఇతరులు రూ.100 చెల్లించాలని కోరారు. ఎన్‌ఎంఎంఎస్‌ఎస్ పరీక్షలో ఉతీర్ణులైతే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏటా రూ.12వేలు స్కాలర్‌షిప్ లభిస్తుందని చెప్పారు. డిసెంబర్ 7న రాత పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు.