
గుట్టు విప్పనున్న అఫిడవిట్
మెదక్ కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో మంది రాజకీయ నాయకుల గుట్టు బయట పెట్టనున్నాయి. ఇప్పటి వరకు ప్రజలు తెలియకుండా దాచిపెట్టిన అన్ని రహస్యాలను ఎన్నికల అఫిడవిట్ బయట పెట్టనుంది. అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థుల నుంచి అఫిడవిట్ ద్వారా వివరాలు తెలుసుకుంటున్న ఎన్నికల సంఘం ఈ సారి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పక్కాగా తెలుసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అఫిడవిట్ షీట్ అందజేయనున్నారు. అందులో అభ్యర్థులు తమ నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన ఇద్దరు సాక్షులు ధ్రువీకరించిన స్వీయ ప్రకటన (అఫిడవిట్)ను నామపత్రంతో పాటు దాఖలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
విధిగా సమర్పించాల్సిందే..
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ్, పంచాయతీ వార్డుకు పోటీ చేసే అభ్యర్థులు నేరపరంగా పూర్వాపరాలు, సివిల్, క్రిమినల్ కేసులు, విధించిన శిక్షలు, కోర్టుల్లో పెండింగ్ కేసుల వంటి వివరాలతో పాటు స్థిర, చరాస్తులు, అప్పులు, విద్యార్హతలు విధిగా సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థి తనతోపాటు కుటుంబ సభ్యులైన భార్య, కుమార్తె, కుమారుడికి సంబంధించిన వివరాలు పొందుపర్చాలి.
తిరస్కరణకు గురవుతారు
నామపత్రంతో పాటు అందించే ధ్రువీకరణ పత్రంలో గడిని ఖాళీగా వదిలేయకూడదు. తనకు వర్తించదని, లేదా నదారత్ అని రాయాలి. లేకుంటే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. కుమార్తెకు వివాహమైతే ఆమె వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. కుమారుడికి వివాహమైతే కోడలి వివరాలు పేర్కొనాలి. కుమారుడు, కోడలు కుటుంబం విడిగా నివసిస్తుంటే అవసరం ఉండదు.
అభ్యర్థులు తప్పనిసరిగా దాఖలు చేయాల్సిందే
ఆస్తులు, అప్పులు తదితర వివరాలు పొందుపర్చాలి
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ
వివరాలు తప్పుగా ఉంటే కేసులు..
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని వివరాలు సమర్పించాలి. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం నేర చరిత్ర, ఆస్తులు, అప్పుల వివరాలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అదే రోజు ప్రదర్శిస్తుంది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ తప్పుగా ఉన్నట్లు రుజువైతే ఎన్నికల సంఘం క్రిమినల్ కేసు నమోదు చేస్తుంది.