
రౌడీ షీటర్ దారుణహత్య
బండరాయితో బాది హత్య చేసిన సహచరులు
చిన్నశంకరంపేట(మెదక్): రౌడీ షీటర్‌ను దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన మండలంలోని శాలిపేట గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ కథనం మేరకు... గ్రామానికి చెందిన ఉప్పరి యాదగిరి(45)కి నేర చరిత్ర ఉంది. అతడిపై హత్యాయత్నంతోపాటు పలు కేసులు ఉన్నాయి. ఒంటరిగా జీవిస్తున్న అతడికి పాలివారితో కూడా గొడవలు ఉన్నాయి. మరోవైపు పాలివారైన ఉప్పరి రాములు, శ్యామ్, ఎల్లం వారం రోజుల క్రితం గొర్రెలను దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసు విచారణలో ఉండగానే దసరా వచ్చిందని, గ్రామస్తుల జామీనుపై నిందితులు ముగ్గురిని సొంత గ్రామానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం యాదగిరితో కలిసి ముగ్గురు మద్యం తాగారు. తమను నేరాలకు ప్రేరేపిస్తూ తమతో దొంగతనాలు చేయిస్తూ తమకు చెడ్డ పేరు వచ్చేందుకు కారణం నువ్వేనంటూ ఆగ్రహంతో యాదగిరిని బండరాయితో దాడిచేసి హత్య చేశారు. వెంటనే నిందితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీమ్ బృందంతో ఆధారాలు సేకరించారు. చిన్నశంకరంపేట ఎస్‌ఐ నారాయణగౌడ్, రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
చికెన్ సెంటర్ నిర్వాహకుల మధ్య ఘర్షణ

రౌడీ షీటర్ దారుణహత్య