అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తుండగా..

Oct 7 2025 4:52 AM | Updated on Oct 7 2025 4:52 AM

అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తుండగా..

అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తుండగా..

సిద్దిపేటకమాన్‌: ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం... పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన పోతిరెడ్డి యాదవరెడ్డి, అంజలి దంపతుల కుమారుడు వివేక్‌ కిరణ్‌రెడ్డి (22) హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవలే ఐఐటీ పూర్తి చేసి మూడు నెలల క్రితం సిద్దిపేటకు వచ్చాడు. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అయితే రోజు మాదిరిగానే అతడు హౌసింగ్‌బోర్డు కాలనీలోని జిమ్‌కు సోమవారం ఉదయం వెళ్లాడు. ఈ క్రమంలో స్నేహితుడితో కలిసి అతడు కిందకు వస్తుండగా భవనం రెండవ అంతస్తులో ఉన్న ఓ రెస్టారెంట్‌కు సంబంధించిన ఫ్లెక్సీ దారికి అడ్డుగా పడింది. గమనించిన వివేక్‌ ఫ్లెక్సీని తీసి పక్కకు వేస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

మెట్ల పైనుంచి పడి..

జిన్నారం (పటాన్‌చెరు : మెట్లు ఎక్కుతూ కిందపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన బొల్లారం పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ దశరథ్‌ వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చిన్న (51) కొంతకాలంగా బొల్లారం పట్టణ పరిధిలోని పోచమ్మ బస్తీలో నివాసముంటున్నాడు. గత నెల 21న తను నివాసముండే పై అంతస్తుకు మంచినీటి డబ్బాతో మెట్లు ఎక్కుతున్న క్రమంలో కిందపడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలు కాగా నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చికిత్స పొందుతూ..

జహీరాబాద్‌ టౌన్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. టౌన్‌ ఎస్‌ఐ.వినయ్‌కుమార్‌ కథనం ప్రకారం... మహరాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కిడ్‌మోడి గ్రామానికి చెందిన బాలాజీ(41) ఈ నెల 3న రాత్రి బైపాస్‌ రోడ్డులో గల అల్గోల్‌ చౌరస్తా నుంచి పట్టణంలోకి కాలినడకన వెళుతున్నాడు. అల్పా కంపెనీ వద్ద ఎదురుగా వస్తున్న టీఎస్‌15 ఈఏ5135 నంబర్‌ గల కారు బాలాజీని ఢీకొట్టింది. దీంతో ఆయనకు తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్‌లో పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాగా కారు డ్రైవర్‌ గౌతంరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దశదినకర్మకు వెళ్లి స్నానం చేస్తుండగా..

జిన్నారం (పటాన్‌చెరు): నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం గుమ్మడిదల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ రెడ్డి వివరాల ప్రకారం... పట్టణ కేంద్రానికి చెందిన తుడుము భాగయ్య (40) ఆదివారం మధ్యాహ్నం చిన్నాన్న దశదినకర్మ కావడంతో తలనీలాలు తీయించుకొని స్థానిక కుంట వైపు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం సాయంత్రం అదే కుంటలో శవమైతేలాడు. మృతుని సోదరుడు లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement