
పెట్రోల్‌లో నీటి కలకలం
వాహనదారుడి ఆందోళన
దుబ్బాకటౌన్: ద్విచక్రవాహనంలో పోయించుకున్న పెట్రోల్‌లో నీరు కలిసిందంటూ వాహనదారుడు ఆందోళన చేశాడు. ఈ ఘటన సోమవారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటకు చెందిన బాబు గొర్రెల వ్యాపారి. పట్టణంలోని టీజీఎస్ ఆర్టీసీ లోకల్ పెట్రోల్ బంక్‌లో సోమవారం రూ.190 విలువ గల పెట్రోల్‌ను ద్విచక్రవాహనంలో పోయించుకున్నాడు. అక్కడి నుంచి రాజక్కపేటకు వెళ్లే సరికి వాహనం ఆగిపోయి, తిరిగి స్టార్ట్ కాలేదు. దీంతో ద్విచక్రవాహనాన్ని ఆటోలో బంక్‌కు తీసుకొచ్చాడు. అనంతరం వాహనంలోని పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్‌ని మూడు ప్లాస్టిక్ బాటిళ్లలోకి తీశాడు. పైన పెట్రోల్, కింద నీరు ఉన్నట్లు బంక్ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చాడు. నీరు కలిసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని వారు చెప్పారు. దీంతో తనకు న్యాయం చేసి, బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వాహనదారుడు అధికారులను డిమాండ్ చేశాడు.