నరసరావుపేట: జిల్లాలో కొండమోడు–పేరేచర్ల మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 167ఏజీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో జాతీయ రహదారులు 167ఏజీ, 167ఏ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. పిడుగురాళ్ల – సత్తెనపల్లి – పేరేచర్ల రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో హైదరాబాద్ వెళ్లే వాహనాల రద్దీ ఇబ్బందిగా మారిందన్నారు. ప్రజల సౌకర్యార్థం రోడ్డు విస్తరణ పనులు ముందుగా ప్రారంభించి పూర్తిచేయాలన్నారు. నకరికల్లు – వాడరేవు జాతీయ రహదారి 167ఏ నిర్మాణం కోసం భూసేకరణకు రైతులకు ఆమోదయోగ్యమైన ధరను నిర్ణయిస్తామన్నారు. జేసీ సూరజ్ గనోరే, జాతీయ రహదారుల ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ సంజీవ రాయుడు పాల్గొన్నారు.
భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి
నరసరావుపేట: వినుకొండ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు, చుక్కల భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకొని ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో ధర్నా నిర్వహించి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు మాట్లాడుతూ సర్వేనెంబర్ 50/5, 63/8లోని సుమారు 68 ఎకరాల ప్రభుత్వ భూములు, చుక్కల భూములను రెవెన్యూ యంత్రాంగంతో కుమ్మకై ్క భూస్వాములు ఆక్రమించి భూ వ్యాపారం చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులైన ఓ ఇద్దరు తమ కుటుంబ సభ్యులను బినామీలుగా పెట్టి పైన పేర్కొన్న సర్వే నంబర్లలోని 68 ఎకరాల ప్రభుత్వం దళితులకు ఇచ్చిన చుక్కల భూములుగా రికార్డుల్లో ఉన్న భూములను కొనుగోలు పేరుతో రికార్డులు సృష్టి్‌ంచుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి కబ్జాదారుల చేతుల్లో ఉన్న ఆ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేయవలసిందిగా కలెక్టర్‌ను కోరామన్నారు. సీనియర్ నాయకులు రెడ్డిబోయిన ప్రసన్నకుమార్, పీడీఎం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.రాంబాబు, సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, కార్యదర్శి జి.రామకృష్ణ, గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు వి.కోట నాయక్ పాల్గొన్నారు.
సిఫార్సు బదిలీలు నిలిపివేయాలని డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం సిఫార్సు బదిలీలు చేపట్టడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని, తక్షణమే వాటిని నిలిపివేయాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవ లింగారావు, ఎండీ ఖాలీద్ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడిని అన్యాయంగా వేరొక పాఠశాలకు బదిలీ చేసి, ఆ స్థానంలో కృష్ణా జిల్లా నుంచి హెచ్‌ఎంను తీసుకురావడం గుంటూరు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు అవమానమేనన్నారు. చట్టంలో విద్యాసంవత్సరం మధ్యలో ఎలాంటి బదిలీలు ఉండవని చెప్పిన ప్రభుత్వం గుంటూరు జిల్లాకు సంబంధం లేని హెచ్‌ఎంను తీసుకురావడం సరైనది కాదన్నారు. ఇలా ఆరుగురు ఉపాధ్యాయులు కేటగిరీ 1, 2 పాఠశాలల్లో విధుల్లో చేరినట్లు తెలుస్తోందని చెప్పారు. ప్రభుత్వ చర్యల కారణంగా రాజకీయ పలుకుబడి లేని సాధారణ ఉపాధ్యాయులను ఆందోళనకు గురి అవుతున్నారన్నారు. కౌన్సెలింగ్‌కు విరుద్ధంగా ఉన్న ఈ తరహా బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల ధర్నా