
చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
చేనేత రంగ పరిరక్షణకు సమగ్ర విధానం ప్రకటించాలి ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
సత్తెనపల్లి: చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయని, చేనేత రంగ పరిరక్షణకై సమగ్ర విధానాన్ని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభల ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గ రావు అధ్యక్షత వహించారు. ముందుగా మహాసభల ప్రాంగణం ముందు సంఘం జెండాను చేనేత కార్మిక సంఘం సీనియర్ నాయకులు అనంత పిచ్చయ్య ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమంది కార్మికులు ఆధారపడి పనిచేస్తున్న చేనేత రంగాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని తీసుకురావడంతో ఆ రంగం మరింత నిర్వీర్యమైందన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు మరింత పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభలలో చేనేత రంగ పరిరక్షణకు ప్రభుత్వాలు సమగ్ర విధానాన్ని ప్రకటించాలని, చేనేతరంగంపై జీరో జీఎస్టీని ప్రకటించాలని,లేబర్ కోడ్‌లు రద్దుచేసి పనిగంటలను తగ్గించాలని, ‘సర్వశిక్ష‘ ద్వారా పాఠశాల విద్యార్థు లందరూ చేనేత దుస్తులు వాడుకునేటట్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేయాలని ఆయన సూచించారు.