
ప్రమాదకరంగా బీబీసీ కెనాల్ డ్రాప్
● ఇప్పటి వరకు ప్రాణాలు
కోల్పోయిన వారు పది మంది
● డ్రాప్ వద్ద రక్షణ చర్యలు శూన్యం
● పట్టించుకోని కెనాల్స్ అధికారులు
నకరికల్లు: బెల్లంకొండ బ్రాంచి కెనాల్‌పై త్రిపురాపురం వద్ద ఉన్న డ్రాప్ ప్రమాదకరంగా మారింది. డ్రాప్ వద్ద నీటి ఉధృతి అధికంగా ఉండడంతో ఈత కొట్టేందుకు, వాహనాలు శుభ్రం చేసుకునేందుకు వచ్చే వారు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. డ్రాప్‌కు ఇరువైపులా కట్ట బలహీనంగా ఉంటుంది. స్థానిక యువకులు ఈత కొట్టేందుకు, ట్రాక్టర్‌లు, ఆటోలు శుభ్రం చేసుకునేందుకు వస్తుంటారు. అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీ డ్రైవర్‌లు, క్లీనర్ స్నానాలు చేసేందుకు దిగుతుంటారు. డ్రాప్ సమీపంలో లోతు ఎక్కువగా ఉండడం, నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడం, కట్ట మట్టి జారుతుండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్న ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం గాని కట్ట బలహీనంగా ఉన్నచోట జారకుండా చూడడం, ప్రమాదాలు సంభవిస్తున్న చోట ఎవరూ దిగకుండా చూడడం వంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. అధికారులు ఇప్పటికై నా స్పందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.