
● జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ● పీజీఆర్‌ఎస్‌లో 149 అ
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ ద్వారా జిల్లా నలుమూలలు నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలపై కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా అధికారులకు 149 అర్జీలు అందజేశారు. పీజీఆర్‌ఎస్ ఇన్‌చార్జి, పులిచింతల ప్రాజెక్ట్ ప్రత్యేక కలెక్టర్ బి.గాయత్రీదేవి, డీఆర్‌ఓ ఎ.మురళి, జిల్లా అధికారులు భానుకీర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
గుండ్లపల్లి గ్రామంలో రెండో సచివాలయ పరిధిలో ఏడువేలమంది జనాభా ఉండగా అందులో నాతో పాటు అనేకమంది దివ్యాంగులు, వృద్ధులు ఉన్నారు. సచివాలయంలోకి వెళ్లేదారిలో డ్రైనేజ్ కాలువ అడ్డంగా ఉంది. అది దాటేందుకు తగిన మార్గంలేదు. ఇబ్బందులు పడుతున్నాం. కల్వర్టు ఏర్పాటుచేసి ఇబ్బందులు తీర్చండి.
–సీహెచ్ అల్బనాబీ, దివ్యాంగుడు,
గుండ్లపల్లి, నకరికల్లు మండలం
నేను కొనుగోలు చేసిన రెండుసెంట్ల భూమికి సంబంధించిన పత్రాలను నా అల్లుడు దాచిపెట్టాడు. అడిగితే నీకెటువంటి హక్కులేదని ఇంట్లో నుంచి బయటకు గెంటాడు. 77ఏళ్ల వయస్సులో ఒంటరిగా ఉంటున్నా. నా బతుకుదెరువుకోసం ఆ స్థలాన్ని అమ్ముకోవాలని అనుకుంటున్నా. ఆ కాగితాలను ఇప్పించి నాకు న్యాయం చేయండి. ఇప్పటికే రెండుసార్లు అర్జీలు అందజేశాను. పట్టించుకోలేదు.
–దేవళ్ల శ్రీనివాసరావు, గుడిపూడి,
సత్తెనపల్లి మండలం