
జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు గర్వకారణం
నరసరావుపేట: జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం భువనచంద్ర టౌన్‌హాలులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థచైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుతో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 527 గ్రామ పంచాయతీలు, ఆరు పట్టణ స్థానిక సంస్థలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయని, స్థానిక సంస్థల్లో డోర్ టు డోర్ కలెక్షన్ 93శాతం జరుగుతుందన్నారు. అందులో 42శాతం చెత్తసేకరణ జరిగిన చోటనే తడి, పొడి చెత్తగా వేరు చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో 100 శాతం ఇంటి వద్దే వేస్ట్ కలెక్షన్, సెగ్రేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వచ్ఛతా కార్యకలాపాలపై చేసిన కృషిని గుర్తించి ప్రభుత్వం అవార్డులను ఏర్పాటు చేసిందన్నారు. స్వచ్ఛ నగర, మండలాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్‌స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు మొదలైన వివిధ విభాగాలలో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, మొత్తం 17 కేటగిరీలలో అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో అవార్డుకు ఎంపికై న దళిత బహుజన రిసోర్స్ సెంటర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ప్రదానం చేశామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా అవార్డులను ప్రకటిస్తోందని, అదేబాటలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు అభినందనీయమన్నారు. పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేసిన కలెక్టర్ కృతికా శుక్లా