
మృతుడు గుంటూరు వాసి
● ఆటోలో ప్రమాదానికి గురై.. దుర్మరణం
●తోడుగా వచ్చిన ఆటో డ్రైవర్ పరారు!
●గంటల వ్యవధిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
యడ్లపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన కేసును యడ్లపాడు పోలీసులు 24 గంటల్లోనే చేధించి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని బోయపాలెం–చెంఘీజ్‌ఖాన్‌పేట మార్గంలో మంగళవారం ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన దారుణంగా మృతి చెంది పడిఉన్న కేసును పోలీసులు మూడు బృందాలుగా దర్యాప్తు చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి గుంటూరు సంగడిగుంట కాలనీకి చెందిన షేక్ రహీంగా గుర్తించారు. ఆటో డ్రైవర్ రాళ్లబండి శివనాగేంద్రబాబు అతని మిత్రుడైన రహీం కలిసి యడ్లపాడు మండలం చెంఘీజ్ ఖాన్‌పేట గ్రామంలోని బంధువుల ఇంటికి ఈనెల 6వ తేదీన రాత్రి 10.30 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరారు. అయితే వాహనాన్ని అతివేగంగా నడపడం వల్ల బోయపాలెం గురుకుల పాఠశాలకు వెళ్లే మార్గం వద్ద అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్కనే కూర్చున్న రహీం (47) రోడ్డుపై పడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడి మృతిని చూసి భయపడ్డ శివనాగేంద్రబాబు ఆటోను లేపి అక్కడి నుంచి వాహనం తీసుకుని వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం స్థానికులు రోడ్డు పక్క మృతి చెందిన రహీంను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు. అదేరోజు సాయంత్రం చెంఘీజ్‌ఖాన్‌పేటలో డ్రైవర్ శివ నాగేంద్రబాబును అదుపులోకి తీసుకుని ప్రమాదానికి కారణమైన ఆటోను స్టేషన్‌కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు మృతుడు తమ కుమారుడేనని నిర్ధారించారు. దీంతో తండ్రి షేక్ సైదా ఫిర్యాదుతో ఎస్‌ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.