
గ్రామాభివృద్ధికి ‘ఉపాధి’ నిధులు వినియోగించండి
బొల్లాపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. బుధవారం మండల కేంద్రం బొల్లాపల్లిని సందర్శించి, ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. బొల్లాపల్లిలోని రామాలయం వద్ద ప్రజా సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. మండల ప్రజలు పలు సమస్యలపై కలెక్టరుకు అర్జీలు అందజేశారు. తొలుత గ్రామానికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి పొలంలో నీటికుంట, ఉద్యాన పంటలో భాగంగా సాగుచేసిన కొబ్బరి తోట, గ్రామంలో ఇంకుడు గుంతలు, చెరువు, ప్రభుత్వ కార్యాలయాలు వద్ద నేటి సంరక్షణకు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపాధి నిధులను సద్వినియోగపరచుకోవాలని ఆదేశించారు. వెల్దుర్తి, బొల్లాపల్లి, ఈ రెండు మండలాల్లో భూగర్భ జలాలు నీటిమట్టం తక్కువగా ఉన్న నీటి సంరక్షణకు, భూగర్భ జలాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ద్వారా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఇబ్బందులు తలెత్తకుండా నీటి నిల్వకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. గ్రామంలోని చెరువు అభివృద్ధి ద్వారా సుమారు వెయ్యి ఎకరాలకు పైగా లబ్ధి చేకూరుతుందని, చెరువు అభివృద్ధి పరచి నీళ్లు వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. గ్రామంలో సైడు కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల ప్రాధాన్యత, అగ్రహార రీ సర్వ్ కు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నరసరావుపేట ఇన్‌చార్జి ఆర్డీవో రమణ కాంత్ రెడ్డి, డీపీఓ నాగేశ్వరరావు నాయక్, మైనర్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ రావు, గ్రౌండ్ వాటర్ జిల్లా అధికారి రామ్ బాలాజీ రెడ్డి డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ చంద్రశేఖర్ మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా