
విచారణకు పిలిచి.. వాయిదా వేశారు
మాచర్ల: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదివీడు గ్రామంలో గత కొన్ని నెలల క్రితం జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) సోదరులపై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీఆర్కే సోదరులకు అనుకూలంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇదే కేసులో రెండోసారి విచారణకు రావాలని పీఆర్కే సోదరులకు నోటీసులు ఇచ్చి బుధవారం విచారణకు పిలిచారు. ఉదయం 10 గంటలకు విచారణ వాయిదా వేస్తున్నట్లు, ఈనెల 10వ తేదీన విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు.
సత్తెనపల్లి: దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా అర్ధరాత్రి తరలిస్తుండడంతో పట్టణ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి నుంచి పరస రబ్బాని, షేక్ సుభాని, షేక్ ఇర్ఫాన్, గుంటూరు ప్రసాద్, తులసీకృష్ణలు టాటా ఏస్ వాహనంలో 720 కిలోల రేషన్ బియ్యాన్ని లోడ్ చేసుకొని వెళుతుండగా అందిన సమాచారం మేరకు పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్ సిబ్బందితో మంగళవారం అర్ధరాత్రి పట్టణంలోని గార్లపాడు సెంటర్‌లో దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని పౌరసరఫరాల గోదాములో రెవెన్యూ అధికారులకు అప్పగించారు. టాటా ఏస్ వాహనాన్ని సీజ్ చేసి పట్టుబడిన ఐదుగురిని బుధవారం కోర్టులో హాజరపరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
తెనాలిరూరల్: అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టణ బుర్రిపాలెం రోడ్డులోని పాలాద్రి కాల్వ సమీపంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో వన్‌టౌన్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి సుమారు 60 బస్తాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
కారెంపూడి: మండలంలో విచ్చల విడిగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ తరలింపుకు కారెంపూడి పోలీసులు మంగళవారం రాత్రి బ్రేక్ వేశారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 90 గోతాలలో ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వాసు బుధవారం విలేకర్లకు వెల్లడించారు. ఒక్కో తెల్ల గోతాంలో సుమారు 40 కిలోల దాకా రేషన్ బియ్యం ఉన్నాయని ఎస్సై పేర్కొన్నారు. ముందుస్తుగా అందిన సమాచారం మేరకు దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఈ సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులకు తెలిపామని వివరించారు.

విచారణకు పిలిచి.. వాయిదా వేశారు