
సహకార సంఘాల్లో యూరియా గోల్‌మాల్
తాడికొండ: కో ఆపరేటివ్ సొసైటీల్లో యూరియా గోల్‌మాల్ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. దీనిపై సంబంధిత వ్యవసాయ శాఖాధికారుల నిఘా కొరవడటంతో సామాన్యుడికి యూరియా అందని ద్రాక్షగా మారింది. సోమవారం తాడికొండ మండలం పొన్నెకల్లు సొసైటీకి చెందిన ఎరువుల లారీ నిబంధనలకు విరుద్దంగా అడ్డరోడ్డు కూడలిలో ట్రాక్టర్‌కు లోడింగ్ చేస్తుండగా ‘సాక్షి’కి చిక్కారు. ఈ క్రమంలో కూలీలు ముఖం దాచుకొని కిందకి దిగి డోర్లు వేయగా... లారీ, ట్రాక్టర్లతో డ్రైవర్లు తలో దిక్కుకు వెళ్లిపోయారు. సొసైటీకి చెందిన యూరియా బస్తాలు ఎవరికి ఇస్తున్నారు? రోడ్డుపై ఎందుకు ఇలా దించుతున్నారు? అని ప్రశ్నించగా ఎవరికి వారే నీళ్లు నములుతూ ముఖం చాటేశారు. రైతులకు సక్రమంగా సరఫరా చేయాల్సిన వ్యవసాయ శాఖ కనీస నిబంధనలకు కూడా నీళ్లొదిలింది. అన్ని సొసైటీల్లోనూ సరుకు తప్పుదారి పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.