
సొమ్మొకరిది.. షోకొకరిది!
విజయవాడ ఉత్సవ్‌కు టూరిజం నిధులివ్వాలంటూ ప్రతిపాదనలు నిర్వహణ పేరుతో ప్రైవేటు సంస్థకు ఇచ్చేందుకు ప్రణాళిక ఆగమేఘాలపై కదిలిన ఫైలు ఇప్పటికే ఎగ్జిబిషన్‌లో షాపులకు రూ. లక్షలు దండుకున్న వైనం భారీ ఎత్తున ప్రైవేటు సంస్థల నుంచి చందాలు సైతం వసూలు
వసూళ్ల ‘ఉత్సవ్’..
‘ప్రభుత్వ సహకారం’తో రూ. 5కోట్లు కొట్టేసేందుకు స్కెచ్!
విజయవాడ ఉత్సవ్ పేరుతో గొడుగుపేట వేంకటేశ్వర స్వామి భూమిని కాజేసేందుకు చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. దీంతో తాత్కాలికంగా 56 రోజులపాటు ఆ భూమిని లీజుకు తీసుకున్నారు.
ఉత్సవ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మెడికల్ అసోసియేషన్, ఆస్పత్రులు, హోటళ్ల అసోసియేషన్, బంగారు వ్యాపారులు, పెద్ద పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు సంస్థల నుంచి రూ. కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు టీడీపీ ప్రభుత్వం వచ్చాక తమ వ్యాపారాలు సరిగా సాగడం లేదని, తాము చందాలు ఇవ్వలేమని వేడుకున్నా.. వదలకుండా జీఎస్టీ అధికారులతో దాడులు చేయిస్తామని బెదిరించి వసూళ్లకు తెగబడ్డారు.
వైబ్రెంట్ విజయవాడ పేరుతో పార్లమెంట్ ప్రజా ప్రతినిధి అనుచరులు భారీ దోపిడీకి పాల్పడినట్లు టీడీపీ వర్గాలే బహిరంగంగా పేర్కొంటున్నాయి.
దీంతో పాటు ఎగ్జిబిషన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్ నిర్వాహకుల నుంచి భారీగా రేట్లు పెట్టి మరీ డబ్బులు వసూలు చేశారు. ఈ వ్యవహారం అంతా పార్లమెంట్ ప్రజా ప్రతినిధి అనుచరుల కనుసన్నల్లోనే సాగింది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఉత్సవ్ పేరుతో టూరిజం నిధులకు ఎసరు పెట్టారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడకు ‘ఏపీ ప్రభుత్వ సహకారంతో’ అనే ట్యాగ్ తగిలించి.. రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజయవాడ ఉత్సవ్ కమిటీ టూరిజం శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి టెండరు పిలువకుండా, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి టూరిజం అధికారులు సైతం ఫైల్‌ను ఆగమేఘాల మీద సిద్ధం చేశారు. దీని వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందని తెలుస్తోంది. అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఎలాగైనా నిధులు మంజూరు చేయించుకోవాలని టీడీపీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ నిధులు రేపోమాపో విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నిధులన్నీ స్వాహా చేసేందుకేనని, టీడీపీ వర్గాల్లోనూ ప్రస్తుతం చర్చ సాగుతోంది. కనకదుర్గమ్మ ఉత్సవాలకు పైసా విదల్చని ప్రభుత్వం, ప్రైవేటు కార్యక్రమానికి నిధులు మంజూరు చేయడం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతా ఫ్లాప్ షో..
పున్నమీ ఘాట్‌లో ఉత్సవాల ప్రారంభం రోజున జనాలు లేక వెలవెలబోయింది. ప్రారంభం చేసేందుకు వచ్చిన నేతలు సైతం అప్పట్లో పెదవి విరిచినట్లు అంతా చెప్పుకున్నారు. ఉపరాష్ట్రపతి హాజరైన సమయంలో కూడా జనాలు రాకపోవడంతో పరువు పోతుందని, హడావుడిగా డ్వాక్రా మహిళలను తరలించినట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. దుర్గమ దర్శనం ఉచితంగా కల్పిస్తే.. అక్కడ జరిగే కార్యక్రమాలకు ‘మీషో’ ద్వారా టికెట్ల అమ్మకాలు చేసి సొమ్ము చేసుకున్నారు. రెండు గంటల షోలకు భారీగా టికెట్టు ధర పెట్టి దండుకున్నారు. ఇంతలా ప్రజల నుంచి దోచుకున్న ఆ ప్రైవేటు కార్యక్రమానికి ఇప్పుడు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం ఏంటనే ప్రశ్న పలువురి నుంచి వ్యక్తం అవుతోంది. విజయవాడ ఉత్సవ్ పేరుతో జరిగిన ప్రతి కార్యక్రమం వ్యాపార కోణంలోనే జరిగిందనే భావన విజయవాడ వాసుల్లో సైతం ఉంది. అమ్మవారి ఉత్సవాల ప్రాశస్త్యం తగ్గించేలా, విజయవాడ ఉత్సవ్‌కు చేసిన భారీ ప్రచారంపైనా పలువురు పెదవి విరుస్తున్నారు.