
శోభాయమానంగా గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ మంగళవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము 5.55 గంటలకు ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రథంపై శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లు అధిష్టించగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దుర్గగుడి ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్‌జేసీ భ్రమరాంబ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భక్తజన కోలాహలం..
మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యా ల నడుమ.. నగరంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనులు ఆది దంపతుల వెంట ముందుకు సాగారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ కోర్కెలు నెరవేసి, సుఖ సంతోషాలతో ఉంటా రని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆదిదంపతులకు పూజలు నిర్వహించారు.
స్వర్ణకవచాలంకృతా పాహిమాం..
పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ స్వర్ణకవచం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, స్వర్ణకవచం అలంకరణ, అనంతరం అంతరాలయంలో ఖడ్గమాలార్చన నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చనకు 26 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఇక ఆలయంలో నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సుప్రభాతవ సేవలో 9 మంది, ఛండీహోమంలో 110 మంది ఉభయదాతలు, లక్ష కుంకుమార్చనలో 11 మంది, శ్రీచక్రనవార్చనలో 37 మందితో పాటు పరోక్ష సేవలోనూ ఉభయదాతలు విశేషంగా తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. అమ్మవారికి స్వర్ణకవచంలో దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ నెల 2వ తేదీతో దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ ఆదివారం వరకు భవానీల రద్దీ కొనసాగింది.
11న ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం..
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం 11వ తేదీన జరగనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఆ రోజు కార్యక్రమాన్నీ ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట గానీ, మహామండపం ఆరో అంతస్తులో గానీ నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.