
నల్ల జెండాలతో నిరసన తెలుపుదాం
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న దోపిడీ చర్యలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్ధించడం దారుణమని, భూమి, అడవులు, జీవనాధారాన్ని కాపాడుకునేందుకు పోరాటం ఉద్ధృతం చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ అధ్యక్షతన మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆదివాసీ, అటవీ హక్కులు, చట్టాలను ధిక్కరించి ఆదివాసీలను జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం అదాని, నవయుగ, మెగా, షిర్డీ సాయి కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆదివాసీలు నల్ల జెండాలతో ఆదివాసీ గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని తీర్మానించారు.
దుర్మార్గమైన చర్య..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జీవోలు 2,13,51 రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగించాలన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆమోదం లేకుండా చట్టాలు ధిక్కరించి ప్రాజెక్టు నిర్మాణం చేయడం దుర్మార్గమన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పల నర్స, మైదానం గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దిసర ప్రభాకర్, గిరిజన ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్ బాలాజీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.