జొన్నలకు డిమాండ్
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
నల్లగొండ అగ్రికల్చర్ : జొన్నలకు మార్కెట్‌లో గిరాకీ పెరిగింది. వరి అన్నం తినడం మానేసి జొన్న అన్నం, జొన్న రొట్టెలకు జనం అలవాటు పడుతున్నారు. పూర్వం పేదలు ఎక్కువగా జొన్నలతో చేసిన ఆహారం తినేవారు. వరి అన్నం పండుగ రోజుల్లోనే వండుకునేవారు. కానీ, ప్రస్తుతం షుగర్ బాధితులు పెరుగుతున్నారు. షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే జొన్నరొట్టె గానీ, జొన్న అన్నంగానీ తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో జనం జొన్న రొట్టె, జొన్న అన్నం తినేందుకు మొగ్గు చూపుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలో జొన్నసాగు లేకపోవడంతో మార్కెట్‌లో బియ్యం కంటే.. జొన్నల రేటు ఎక్కువగా ఉంది.
తగ్గుతున్న జొన్న సాగు
జిల్లాలో పది సంవత్సరాలుగా జొన్న సాగు గణనీయగా తగ్గుతోంది. గతంలో దేవరకొండ, చండూరు డివిజన్లలో రైతులు పెద్ద ఎత్తున జొన్న, సజ్జ పంటలను సాగుచేసే వారు. కానీ జిల్లాలో సాగునీటి వనరులు పెరిగిపోవడంతో రైతులు వరి, పత్తి పంటలవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో గతంలో వేలాది ఎకరాల్లో సాగైన జొన్న పంట ఇప్పుడు వందలు, పదుల ఎకరాలకు తగ్గింది. జొన్న వినియోగం ఎక్కువ కావడం, సాగు తగ్గిపోయిన కారణంగా వ్యాపారులు కర్నాటక రాష్ట్రం నుంచి జొన్నలను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. జొన్నల డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రైతులు జొన్న సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
జొన్న రొట్టెలతో ఉపాధి..
జనం జొన్నతో చేసిన పదార్థాలు ఎక్కువగా తింటుండడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో విధుల వెంట జొన్న రొట్టెలు తయారు చేసి విక్రయించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఒక్కో జొన్న రొట్టెను రూ.10 నుంచి రూ.15 వరకు అమ్ముతున్నారు. ప్రధానంగా గిరిజన మహిళలు జొన్న రొట్టెలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
2017 నుంచి జిల్లాలో జొన్న
సాగు ఇలా (ఎకరాల్లో..)
సంవత్సరం జొన్న
2017 409
2018 302
2019 678
2020 175
2021 47
2022 56
2023 76
2024 49
2025 156
ఫ జొన్నలతో చేసిన పదార్థాలు తినేందుకు షుగర్ వ్యాధిగ్రస్తుల మొగ్గు
ఫ మార్కెట్‌లో బియ్యం కంటే.. జొన్నలకే ఎక్కువ రేటు
ఫ జిల్లాలో ఏటా తగ్గుతున్న జొన్న సాగు
జిల్లాలో మెట్టపంటలైన సజ్జ, జొన్న పంటల సాగు గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం మా ర్కెట్‌లో జొన్నలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో జొన్న సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. బియ్యం కంటే జొన్నలకు రేటు ఎక్కువగా ఉంది. రైతులు జొన్న సాగు చేస్తే లాభాలు పొందవచ్చు.
– పాల్వాయి శ్రవన్‌కుమార్, డీఏఓ


