రైతులను ముంచిన వాన
30.5 మిల్లీమీటర్ల వర్షం
పెట్టుబడి కూడా రానట్లుంది
ఎకరాకు 4 క్వింటాళ్లే..
నల్లగొండ అగ్రికల్చర్ : అతివృష్టి కారణంగా జిల్లా రైతులు ఆగమవుతున్నారు. ఈ సీజన్‌లో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో వరి, పత్తి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ వర్షాలతో పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. జిల్లా వ్యాప్తంగా 5,64,585 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి ఏరే సమయంలో అంటే 20 రోజుల నుంచి రెండు మూడు రోజులకోసారి జిల్లా అంతటా వర్షాలు కురిసాయి. దీంతో పత్తి చేలు ఎర్రబారి తెగుళ్ల బారిన పడ్డాయి. అదే విధంగా చేతికొచ్చిన పత్తితో పాటు, పత్తి పగిలిన కాయలు కూడా నల్లబారి నేల రాలాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తిచేలు చనిపోతున్నాయి. ఇక, నాన్‌ఆయకట్టు ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న వరిచేలు నెలవాలుతున్నాయి. చేలలో నీళ్లు నిలిచి మొలకెత్తుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల వరి కోతలకు ఎక్కువ ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు మండలాల్లో అత్యధిక వర్షం
జిల్లా అంతటా వానాకాలం సీజన్‌లో సాధారణ వర్షం కంటే అత్యధికంగా వర్షం కురిసింది. జూన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షం 526.6 మిల్లీమీటర్లుకగా.. 670.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పీఏపల్లి, గుండ్లపల్లి, చందంపేట మండలాల్లో అత్యధిక వర్షం కురవగా.. చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు, శాలిగౌరారం, నకిరేకల్, తిప్పర్తి, కనగల్, మర్రిగూడ, చింతపల్లి, గుర్రంపోడు, అడవిదేవులపల్లి, తిరుమలగిరిసాగర్, పెద్దవూర కొండమల్లేపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి మండలాల్లో అధిక వర్షం కురిసింది. కేతెపల్లి, నల్లగొండ, మునుగోడు, చండూరు, నాంపల్లి, అనుముల హాలియా, నిడమనూరు, త్రిపురారం, మాడుగుపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల, నేరెడుగొమ్ము, గట్టుప్పల్ మండలాల్లో సాధారణ వర్షం కురిసింది.
జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 30.5 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా కనగల్‌లో 115.3మిల్లీమీటర్లు, నిడమనూరులో 84.1, అనుముల హాలియాలో 73.0 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. తిప్పర్తి 51.2, నాంపల్లి 30.5, త్రిపురారం 30.6, మాడుగులపల్లి 34.0, అడవిదేవులపల్లి 43.6, తిరుమలగిరిసాగర్ 55.2, పెద్దవూర 63.2, కొండమల్లేపల్లి 42.2, దేవరకొండ 35.2, గుండ్లపల్లి 37.2, చందంపేటలో 34.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఫ వరుస వర్షాలతో పత్తి, వరి పంటలకు నష్టం
ఫ నల్లబారిన పత్తి, నేలవాలుతున్న వరి
ఫ దిగుబడులు సగానికి పడిపోయే ప్రమాదం
ఎక్కువ వర్షాలు కురడంతో పత్తిచేను పూర్తిగా దెబ్బతిన్నది. పత్తి, కాయలు నల్లగా మారాయి. చేనుకూడా తెగుళ్లు వచ్చి ఎండిపోతోంది. ఈసారి పెట్టిన పెట్టుబడి కూడా రానట్లుంది. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. – చిమట భిక్షమయ్య రైతు,
గుండ్లపల్లి, నల్లగొండ మండలం
జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్ సుమారు 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. గత నెల వరకు ఏపుగా ఉన్న పత్తి చేలు అధిక వర్షాలతో దెబ్బ తినడంతో దిగుబడి సగం తగ్గే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తంగా పత్తి ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చేలు దెబ్బతినడంతో ఎకరానికి 4 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేకుండాపోయింది.
రైతులను ముంచిన వాన


