
పీహెచ్‌సీలో కలెక్టర్ తనిఖీలు
డిండి : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీకి నిత్యం వచ్చే రోగుల వివరాలు, విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీలో నెలకొన్న పలు సమస్యలను మండల వైద్యాధికారి హరికృష్ణ కలెక్టర్‌కు తెలియజేశారు. అనంతరం ఇటీవల స్థానిక ఐటీఐలో ప్రారంభించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను ఆమె పరిశీలించారు. వర్షాలకు రేకుల పైకప్పు నుంచి వర్షపు నీరు లీకేజీ అవుతుందని ప్రిన్సిపాల్ రాధాకృష్ణ కలెక్టర్‌కు వివరించారు. మండల పరిధిలోని కందుకూర్ గ్రామ శివారులోని వాగులో వర్షాల కారణంగా దెబ్బతిన్న మిషన్ భగీరథ పైపులైన్‌ను కలెక్టర్ పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, మిషన్ భగీరథ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితరులున్నారు.