ఆర్టీసీకి కలిసొచ్చిన దసరా
597 అదనపు బస్సులు నడిపించాం
మిర్యాలగూడ టౌన్ : దసరా పండుగ వేళ ఆర్టీసీకి ఆదాయం కలిసొచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం వారం రోజులపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, నార్కట్‌పల్లి, యాదగిరిగుట్ట, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ, మిర్యాలగూడ డిపోల ద్వారా ఆర్టీసీ అధికారులు మొత్తం 597 అదనపు బస్సులను నడిపించారు. నల్లగొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోలలో పండుగకు ముందు.. పండుగ తరువాత మొత్తం 33,99,804 కిలోమీటర్ల మేర బస్సులను తిప్పగా రూ.1,65,78,605 వరకు ఆర్టీసీకి అదనపు ఆదాయం వచ్చింది.
తిరుగు ప్రయాణంలో కిక్కిరిసిన బస్సులు
దసరా పండుగ ముగియడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రయాణికులు పట్టణాల బాట పట్టడంతో అన్ని డిపోల్లోని ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. దసరా పండుగ మరుసటి రోజు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు ప్రతిరోజు ప్రయాణికులతో నిండిపోయాయి. అదేవిధంగా పండుగకు ముందు మూడు రోజులపాటు.. పండుగ తరువాత నాలుగు రోజులపాటు రద్దీగా ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలోని డీఎంలు, అసిస్టెంట్ డీఎంల పర్యవేక్షణలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బస్సులను నడిపించారు.
పండుగ ముందు.. ఆ తర్వాత..
దసరా పండుగకు నల్లగొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులను నడిపించగా.. రీజియన్‌కు రూ.కోటి 65లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఆదాయంలో సూర్యాపేట డిపో ప్రథమ స్థానంలో ఉండగా.. యాదగిరిగుట్ట డిపో రెండో స్థానం, మూడో స్థానంలో మిర్యాలగూడ డిపో నిలిచింది. దసరా పండుగకు ముందు మూడు రోజులు, తరువాత మూడు రోజుల్లో రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా రూ.కోటి 65 లక్షల వరకు అదనపు ఆదాయం వచ్చింది.
డిపోలు అదనపు బస్సులు అదనపు ఆదాయం
దేవరకొండ 60 14,95,942
నల్లగొండ 65 9,63,574
నార్కట్‌పల్లి 48 15,48,815
మిర్యాలగూడ 69 23,19,230
యాదగిరిగుట్ట 133 33,78,701
కోదాడ 92 21,55,178
సూర్యాపేట 130 47,17,165
బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణికులు
అదనపు ఆదాయం రూ.1.65 కోట్లు
ప్రథమ స్థానంలో సూర్యాపేట డిపో
నల్లగొండ రీజియన్ పరిధిలో ఏడు డిపోల నుంచి 597 అదనపు బస్సులను నడిపించాం. ప్రయాణికుల రద్దీని బట్టి ఉద్యోగులు, కార్మికులు పనిచేశారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేశారు. అందరి కృషి వల్లనే రీజియన్‌కు రూ.కోటి 65లక్షల 78 వేల వరకు అదనపు ఆదాయం వచ్చింది.
– కొణతం జానిరెడ్డి, ఆర్‌ఎం నల్లగొండ


