యూరియా కోసం రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లోనే..
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ఒక్క బస్తా యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు నిద్రహారాలు మాని పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్ది క్యూ లైన్‌లో నిలబడలేక నీరసించిపోతున్నారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికి యూరియా బస్తా చేతికి వస్తుందన్న నమ్మకం లేదు. కొత్తగా ఏర్పడిన తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రానికి ప్రత్యేకంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) లేదు. దీంతో ఇక్కడి రైతులకు హాలియాలోని కొత్తపల్లి సహకార సంఘం వద్దనే యూరియా పంపిణీ చేశారు. రెండు మండలాల రైతులు ఒకే కేంద్రం వద్దకు వస్తుండటంతో అధిక సంఖ్యలో బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన అధికారులు గత కొద్ది రోజులుగా తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రంలోని సబ్‌మార్కెట్ యార్డుతో పాటు డొక్కలబావి తండాలో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసి యూరియాను పంపిణీ చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్ కూడా సబ్‌మార్కెట్ యార్డులో ఉంది. పది రోజులుగా యూరియా పంపిణీ జరగలేదు. సోమవారం వ్యవసాయ సబ్‌మార్కెట్ యార్డులో యూరియా పంపిణీ చేస్తారని ముందస్తు సమాచారం తెలుసుకున్న రైతులు ఆదివారం రాత్రి వందల సంఖ్యలో సబ్‌మార్కెట్ యార్డుకు తరలివచ్చారు. ఆదివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి కొంత మంది రైతులు పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి తలదాచుకోగా, కొందరు రైతులు బయటి చెట్ల కిందనే తలదాచుకున్నారు. దీంతో రాత్రి మొత్తం నిద్రహారాలు మాని నిరీక్షించారు. సోమవారం మండల కేంద్రానికి 440 బస్తాలు మాత్రమే రాగా ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. అయినప్పటికీ రైతులందరికి యూరియా అందలేదు.
యూరియా కోసం రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లోనే..


