ఉపాధ్యాయుల్లో ‘టెట్‌’ టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల్లో ‘టెట్‌’ టెన్షన్‌

Oct 8 2025 6:57 AM | Updated on Oct 8 2025 6:57 AM

ఉపాధ్యాయుల్లో ‘టెట్‌’ టెన్షన్‌

ఉపాధ్యాయుల్లో ‘టెట్‌’ టెన్షన్‌

ఏ పేపర్‌ రాయాలో తెలియక గందరగోళం..

నల్లగొండ : ఉపాధ్యాయులను టెట్‌ భయం వెంటాడుతోంది. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పాస్‌ కావాల్సిందేనని సుప్రీంకోర్డు ఇటీవల ఇచ్చిన తీర్పు మెజార్టీ ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్‌ పాస్‌ కావాలని, లేదంటే ఉద్యోగం వదులు కోవాలని తీర్పు వెలువరించడం భిన్న వాదనలకు తెరలేపుతోంది. ఉద్యోగంలో కొనసాగాలన్నా , పదోన్నతి పొందాలన్నా టెట్‌ తప్పని సరి చేయండంతో విధుల్లో ఉన్న టీచర్లలో టెన్షన్‌ మొదలైంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్‌సీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే సర్వీసులో ఉన్న వారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.

జిల్లాలో 5461 మంది ఉపాధ్యాయులు

జిల్లాలో మొత్తం 5461 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో 2,064 మంది ఎస్‌జీటీలు ఉండగా 3,397 మంది స్కూల్‌ అసిస్టెంట్స్‌, సమాన కేడర్‌లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. 2010 నుంచి టెట్‌ను నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఒకసారి, ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత 2017లో ఒకసారి, 2024లో ఒకసారి ఇలా మూడు సార్లు డీఎస్సీల్లో ఉపాధ్యాయులగా నియమితులైన సుమారు 1,500 మంది టెట్‌లో అర్హత సాధించారు. రెండేళ్ల కింద ఎన్‌సీటీఈ ఉపాధ్యాయులందరికీ టెట్‌ అర్హత ఉండాలని ఉత్తర్వులు ఇవ్వడంతో కొందరు అర్హత సాధించారు. ఇంకా దాదాపు 3 వేలకు పైగా మంది టెట్‌ అర్హత సాధించాల్సి ఉంది.

జూనియర్లకు ప్రయోజనం

జిల్లాలో ఏడాది వ్యవధిలో 220 మందికి పైగా ఉపాధ్యాయులు టెట్‌ అర్హత లేకున్నా జీహెచ్‌ఎంలుగా, పీఎస్‌హెచ్‌ఎంలుగా, స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో తర్వాత జరగబోయే పదోన్నతుల్లో జూనియర్లకు మేలు జరగనుంది. దీంతో టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయులు ఎక్కువ మంది డిమాండ్‌ చేస్తున్నారు.

ఐదేళ్లలో పదవీ విరమణ ఉంటే ఓకే..

విద్యాశాఖ సంవత్సరానికి రెండు పర్యాయాలు టెట్‌ నిర్వహిస్తుంది. ఉపాధ్యాయులు రెండేళ్ల కాల పరిమితిలో నాలుగు టెట్‌లలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిబంధన ఉంది. పదోన్నతి పొందాలన్నా టెట్‌ అర్హత సాధించాల్సిందే. అయితే.. ఐదేళ్ల పాటు పదవీ విరమణ అయ్యే వారికి కోర్టు సడలింపు ఇచ్చింది. వారు టెట్‌ రాయాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ పదవీకాలం ఉన్నవారు కచ్చితంగా రెండేళ్లలో టెట్‌ పాస్‌ కావాల్సిందే.

ఫ రెండేళ్లలో అర్హత సాధించాలనిసుప్రీం కోర్టు తీర్పు

ఫ ఉద్యోగంలో ఉండాలన్నా.. పదోన్నతి పొందాలన్నా టెట్‌ తప్పనిసరి..

ఫ ఆందోళనలో సీనియర్లు.. స్వాగతిస్తున్న జూనియర్లు

2010 తర్వాత నిర్వహించిన డీఎస్సీల్లో ప్రభుత్వం ఎస్‌జీటీ ఉద్యోగానికి కేవలం టీటీసీ ఉన్నవారినే అర్హులుగా గుర్తించింది. బీఈడీ ఉన్న వారిని కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకే పరిమితం చేసింది. కానీ 2010 కంటే ముందు నిర్వహించిన డీఎస్సీల్లో మాత్రం టీటీసీ ఉన్నవారు ఎస్‌జీటీ ఉద్యోగానికి మాత్రమే అర్హులు, బీఈడీ ఉంటే ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ రెండు ఉద్యోగాలకూ అర్హత ఉండేది. దీంతో అప్పట్లో బీఈడీ ఉన్న వారు చాలా మంది ఎస్‌జీటీలుగా ఎంపికై ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వారు టెట్‌ రాయాలంటే పేపర్‌–1 (టీటీసీ అర్హత ఉన్నవారికి), పేపర్‌–2 (బీఈడీ అర్హత ఉన్న వారికి) ఏది రాయాలో తేల్చని పరిస్థితి. ఎస్‌జీటీలుగా పనిచేస్తూ బీఈడీ అర్హత ఉంటే.. టెట్‌ అప్లికేషన్‌లో కేవలం పేపర్‌–2 మాత్రమే చూపిస్తుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితిలో ఉపాధ్యాయులకు టెట్‌ మినహాంపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును పునః సమీక్షించేలా రివ్వూ పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement