‘సీఎంఆర్‌ఎఫ్‌’ నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

‘సీఎంఆర్‌ఎఫ్‌’ నిందితుల అరెస్ట్‌

Oct 7 2025 3:31 AM | Updated on Oct 7 2025 3:31 AM

‘సీఎంఆర్‌ఎఫ్‌’ నిందితుల అరెస్ట్‌

‘సీఎంఆర్‌ఎఫ్‌’ నిందితుల అరెస్ట్‌

సూర్యాపేటటౌన్‌ : ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడిన ఎనిమిది మంది నిందితులను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మేళ్లచెర్వు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన పెండెం వెంకటేశ్వర్లు, ప్రైవేట్‌ పీఏగా పనిచేసిన పులిందిండి ఓంకార్‌.. 2023 సంవత్సరం కంటే ముందు మంజూరైన మొత్తం రూ.34,58,400 విలువ గల 51 చెక్కులు అసలైన లబ్ధిదారులకు అందించకుండా లబ్ధిదారుల పేర్లకు దగ్గరగా ఉన్న వ్యక్తులను గుర్తించి అక్రమాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులపై మంజూరైన మొత్తాన్ని కాజేయాలనే దురుద్దేశంతో, చెక్కులపై ఉన్న అసలు లబ్ధిదారుల పేర్లకు దగ్గరగా ఉన్న ఇతరులను వీరు ఎంచుకున్నారు. బెల్లంకొండ వెంకటేశ్వర్లు సహకారంతో నకిలీ లబ్ధిదారుల అకౌంట్లలో ఈ చెక్కులను జమ చేయించి, డబ్బులు డ్రా చేశారు. నకిలీ వ్యక్తులకు కొంత కమీషన్‌ ఇచ్చి మిగిలిన మొత్తాన్ని పంచుకున్నారు. అయితే మేళ్లచెర్వుకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పక్షవాతం రావడంతో 2023లో సీఎంఆర్‌ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. చెక్కు వచ్చినప్పటికీ రాలేదని పక్కదారి పట్టించారు. ఇటీవల తన పేరు మీద వచ్చిన చెక్కును మరొకరు డ్రా చేసుకున్నట్లు తెలియడంతో మేళ్లచెర్వు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేరం మాజీ ఎమ్మెల్యేకు తెలియకుండా క్యాంప్‌ కార్యాలయంలోని ప్రైవేట్‌ వ్యక్తులు తమ స్వలాభం కోసం పాల్పడినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. నిందితుల నుంచి పోలీసులు రూ.7.30లక్షల నగదు, 44 వాడని చెక్కులు, 6 సెల్‌ ఫోన్లు, 6 బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.34,58,400 విలువ గల 51 చెక్కులు ఆధీనంలో పెట్టుకుని వీటిలో రూ.9.50లక్షల విలువగల 7 చెక్కులు దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు . దుర్వినియోగానికి గురైన రూ. 9.50 లక్షలలో బాధితుడికి రూ.2 లక్షల 25వేలు ఇచ్చాక మిగిలిన రూ.7,30లక్షల నగదును నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు పెండెం వెంకటేశ్వర్లు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే పీఏ పులిందిండి ఓంకార్‌తోపాటు నకిలీ లబ్ధిదారులు మాదాసు వెంకటేశ్వర్లు, మట్టపల్లి సైదులు, గొట్టుముక్కల వెంకటేశ్వర్లు, బెల్లంకొండ సైదులు, బెల్లంకొండ పద్మలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

నకిలీ వ్యక్తుల అకౌంట్‌లలోకి

రూ. 9.50 లక్షలు జమ

8 మంది నిందితుల అరెస్ట్‌

రూ.7.30 లక్షల నగదు,

44 చెక్కులు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement