
అధిక వడ్డీ బాధితుడు మృతి
పెద్దఅడిశర్లపల్లి: అధిక వడ్డీ ఆశ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పలుగుతండాకు చెందిన రమావత్ సరియా(37) 20ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో కలిసి మిర్యాలగూడకు వలస వెళ్లాడు. ఈ క్రమంలో తాను సంపాదించిన డబ్బుతో పాటు తన బంధువుల వద్ద అప్పుగా తీసుకున్న సుమారు రూ.కోటి పలుగుతండాకు చెందిన బాలాజీకి అధిక వడ్డీకి అప్పు ఇచ్చాడు. ఇటీవలి కాలంలో బాలాజీ డబ్బులు ఇవ్వడంలేదని తెలుసుకున్న బంధువులు తమ డబ్బులు తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సరియా గత మూడు నెలలుగా బాలాజీ చుట్టూ తిరుగుతున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో బంధువుల వద్ద మాట పోతుందని మనస్తాపానికి గురై సోమవారం మిర్యాలగూడలోని తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రిలో తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సరియా మృతితో పలుగుతండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.